Mar 10,2022 06:57

ప్రజానీకంపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పడుతున్న విద్యుత్‌ భారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది విద్యుత్‌ ఛార్జీల మోత ఏ స్థాయిలో ఉంటుందో ఇంకా స్పష్టం కాలేదు. దీనికి సంబంధించిన రెగ్యులేటరీ కమిషన్‌ కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఈ లోగానే అందుతున్న సంకేతాలు ప్రమాద ఘంటకలను మోగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటింటి సర్వేను పూర్తి చేసిన ప్రభుత్వం విద్యుత్‌ వినియోగానికి సంబంధించి అనేక వివరాలను సేకరించింది. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అనేక రకాల ఛార్జీలు ప్రజల నుండి వసూళ్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధమౌతోందంటూ అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే, అది సాధారణంగా జరిగే ప్రక్రియేనంటూ అప్పట్లో ప్రభుత్వ వర్గాలు ఆ వార్తలను ఖండించాయి. తాజాగా ఓవర్‌లోడ్‌ పేరుతో కర్నూలు జిల్లాల్లో వినియోగదారులకు నోటీసులు జారీ చేయడం చూస్తే అప్పట్లో వ్యక్తమైన అనుమానాలు వాస్తవ రూపం దాల్చుతున్నాయనిపించక తప్పదు. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, కనెక్షన్‌ తీసుకున్న సమయంలో అనుమతి తీసుకున్న లోడ్‌ కన్నా ఎక్కువ లోడ్‌ వినియోగిస్తే అదనపు మొత్తాన్ని చెల్లించితీరాలంటూ విద్యుత్‌ శాఖ అధికారులు ఇస్తున్న వివరణ సాంకేతికంగా సరైనదే కావచ్చు. ఇళ్లలో వాడే విద్యుత్‌ పరికరాలు పెరిగానా, టెక్నాలజీ కూడా పెరగడంతో లోడ్‌ పెరగదన్న వినియోగదారుల వాదన కూడా వుంది. కానీ, ఇన్నాళ్లు ఊరుకుండి ఇప్పుడే ఎందుకు ఈ నిబంధన గుర్తుకొచ్చిందన్న ప్రశ్నకు ప్రభుత్వం జవాబు ఇచ్చి తీరాలి. పైగా కరోనాతో దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలిన వేళ సామాన్యుడిని లక్ష్యంగా చేసుకుని ఈ బాదుడుకు బరితెగించడమేమిటి? ఇంటింటి సర్వే ఆధారంగానే ఒక ఇంటికి ఒకే మీటరు విధానాన్ని అమలు చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం పెదవివిప్పలేదు. అంటే, ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉందనే కదా!
     రైతాంగం వ్యతిరేకిస్తూ ఉన్నా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలనే ప్రభుత్వం నిర్ణయించి ప్రయోగాత్మకంగా మీటర్లు ఏర్పాటు చేసిన శ్రీకాకుళం జిల్లాలో రైతులు ఇప్పుడు అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. ఎలాగూ ఉచితంగా ఇస్తున్నప్పుడు ఇంత ఖర్చు పెట్టి తమ పేర్ల మీద మీటర్లు ఏర్పాటు చేయడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా సకాలంలో చెల్లించలేకపోతే తమ పరిస్థితి ఏమిటని వారు అడుగుతున్నారు. రానున్న కొద్ది నెలల్లో రాష్ట్ర మంతా స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు సన్నాహాలు కూడా జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయ పంపు సెట్లకు కూడా స్మార్ట్‌ మీటర్లు పెడతామని అధికారులు చెబుతున్నారు. అంటే బిల్లు చెల్లింపు ఒక్క నిమిషం లేటైనా కూడా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. రైతులు భయపడుతున్న పరిస్థితి అప్పుడు తలెత్తితే ఏం చేస్తారు? ఒకవేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే నష్టపోయేది కేవలం రైతులు మాత్రమే కాదు. ఉచితమంటూనే రైతుల నుండి సర్వీసు ఛార్జీలను ఇప్పటికే వసూలు చేస్తున్నారు. ఏ కారణంతోనైనా బిల్లు భారం కూడా పడితే రైతులు కుప్పకూలే ప్రమాదం ఉంది.
      విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేస్తేనే అదనపు రుణాలకు అవకాశమిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం పెడుతున్న షరతులే ఈ పరిస్థితికి కారణం. రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తిలో 47 శాతం ఇప్పటికే ప్రైవేటు పరమైంది. పంపిణీ రంగాన్ని కూడా ముక్కలు చేసి ప్రైవేటుకు పందారాం చేయడానికి రంగం సిద్ధమైంది. విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ నియామకం కూడా కేంద్ర పరిధిలోకి వెళ్లిపోతుందన్న అందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా రాష్ట్రాల హక్కులను కబళించడమే! హక్కులపై జరుగుతున్న ఈ దాడిని ప్రతిఘటించడానికి బదులుగా జీ హుజూర్‌ అంటూ ప్రజలపై భారాలు మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటం విచారకరం! పోరాటాలతో తొలిదశ విద్యుత్‌ సంస్కరణలను తిప్పికొట్టిన తెగువ తెలుగు ప్రజలది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఇదే మాదిరి కొనసాగితే మరో పోరాటానికి సిద్ధం కావడమే ప్రజల ముందున్న మార్గం!