పుట్టపర్తి రూరల్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విద్యావ్యవస్థను నాశనం చేసే విధానాలను తీసుకువస్తోందని, దీనిని ద్వారా పేద విద్యార్థులు విద్యకుదూరం అవుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యచంద్రయాదవ్ పేర్కొన్నారు. పుట్టపర్తిలోని ఎనుమలపల్లి వద్ద ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఆసంఘం జిల్లా 4వ మహాసభలను శనివారం నిర్వహించారు. మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన సూర్యచంద్రయాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను వేగంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. అందులో భాగంగా ఇటీవల ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీనివల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడీ అడుగులకు మడుగులు ఒత్తేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. నియంతృత్వ పోకడతో పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి విద్యార్థి లోకం ఐక్య పోరాటాలతో బుద్ధి చెప్పాలన్నారు. నూతనంగా ఏర్పడిన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు, డిగ్రీ, జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్.వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ఇలాంటి వాటికి బుద్ధి చెప్పేందుకు విద్యార్థులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలను చేయాల్సిన ఆవశ్యతక ఉందని పిలుపునిచ్చారు. ఉచిత నిర్బంధ విద్యను సాకుగా చూపి కేవలం 9, 10 తరగతి విద్యార్థులకే ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను పరిమితం చేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని రద్దు చేసి గతంలో మాదిరి విద్యార్థులందరికీ దీనిని వర్తింజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మహాసభలో పలు తీర్మానాలు చేశారు. అందులో సత్యసాయి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగర్జున, బాబావలి, ఉపాధ్యక్షులు బాబ్జాన్, చంద్రశేఖర్, పుట్టపర్తి నాయకులు పవన్, గణేష్, గుణనాథ్‌తో పాటు జిల్లాలోని ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.










