Dec 18,2022 20:14

బిసి వసతి గృహంలో విచారిస్తున్న తహశీల్దారు తులసమ్మ

ప్రజాశక్తి-వీరబలి: విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని తహశీల్దార్‌ తులసమ్మ పేర్కొన్నారు. బిసి వసతి గహంలో ఆదివారం ఆమె విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. వాచ్‌ మెన్‌గా ప్రయివేట్‌ వ్యక్తిని ఎందుకు నియమించుకున్నారని వార్డెన్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం ఎలా ఉందని మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అవన్నీ బాగున్నాయని గంగాధర్‌ ప్రవర్తన తీరుతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆమె దష్టికి విద్యార్థులు తీసుకొచ్చారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు.
అనధికార వాచ్‌మెన్‌ను విధుల నుంచి తొలగింపు
స్థానిక బాలుర బిసి వసతి గృహం అనధికార వాచ్‌మెన్‌ గంగాధర్‌ను విధుల నుంచి తొలగించారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, వారి నుంచి డబ్బులు తీసుకుని మద్యం తెప్పించుకోవడం, భోజనంలో పురుగులున్నాయని చెప్పినా అలాగే తినాలని, లేకపోతే అన్నం లేకుండా చేస్తానని విద్యార్థులను బెదిరించడం వంటి చర్యలకు వాచ్‌మెన్‌ పాల్పడ్డారు. ఆయనపై విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు పిలిపించి మందలించి పంపారు. విషయం వసతి గృహ సంక్షేమాధికారి సుబ్బరాజు దృష్టికి తెలపడంతో అతన్ని విధులకు రావొద్దని ఆదేశించారు. బిసి వసతి గహ సంక్షేమ అధికారి పులివెందులలో పనిచేసిన సమయంలోనూ గంగాధర్‌ కూడా అక్కడే పని చేసేవారు. ప్రస్తుతం వార్డెన్‌ బదిలీపై వీరబల్లికి వచ్చారు. ఇక్కడ రెండు నెలలు నుంచి గంగాధర్‌ను తన సొంత డబ్బులు జీతంగా ఇస్తూ విధుల్లో ఉంచారు. ప్రస్తుతం విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వారి నుంచి మద్యం తప్పించుకోవడం వంటి పనులు చేస్తుండగా విధుల నుంచి తొలగించినట్లు వార్డెన్‌ సుబ్బరాజు చెప్పారు.