విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో విఫలం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్న కుమార్
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్ అన్నారు. మంగళవారం విద్యారంగ సమస్యలపై మ్యూజియం దగ్గర నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్, వర్క్బకు, మూడుజతల ఏకరూప దుస్తులు, తెలుగు-ఇంగ్లీష్ డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఇవన్నీ ప్రభుత్వం పూర్తిగా అందించలేకపోయిందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా రెండో దశ పనుల పూర్తి కాకపోవడం వల్ల వారందరికీ తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ పెరిగాయి. ముఖ్యంగా బాలికలు ప్రభుత్వ విద్యకు దూరమయ్యారన్నారు. 6 నుండి 10 కిలోమీటర్లు నడిచి, లేదా సైకిళ్ల మీద వెళ్లాల్సిన స్థితి వల్ల తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ 26వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేసిందని మండిపడ్డారు. పాఠ్యపుస్తకాలు విద్యార్థులే కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంట్రాక్టు అధ్యాపకులకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, బాత్రూమ్, మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలూ, ల్యాబ్, లైబ్రరీ వసతులు మెరుగుపర్చడం లేదు. ప్రభుత్వ విద్యా మరింత దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు జి.గోపి నాయక్, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా బాలికల కన్వీనర్ ఎస్.కే జాహీదా, జిల్లా కమిటీ సభ్యులు కుమారస్వామి, మాధవ్, ఎస్‌ఎఫ్‌ఐ నగర నాయకులు పునీత్ వర్మ, తదితరులు పాల్గొన్నారు.










