Jul 21,2021 08:32

పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :
విభజన చట్టం అమలుపై లోక్‌సభలో ఏపికి చెందిన ఎంపిలు అడిగిన ప్రశ్నకు పాత సమాధానాలే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని ఎక్కువ అంశాలు అమలు చేశామని, మిగిలిన అంశాల అమలు వివిధ స్థాయిల్లో ఉందని కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్‌ రారు అన్నారు. లోక్‌సభలో టిడిపి ఎంపి కె.రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యా సంస్థలు సంబంధించిన కొన్ని అంశాల అమలకు దీర్ఘకాలం ఉంటుందని, దీని కోసం పదేళ్ల కాలపరిమితి చట్టంలో సూచించబడిందని తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు పురోగతిపై కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సంబంధిత మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లతోనూ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలతోనూ సమీక్ష చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయని తెలిపారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పై ఏపి ప్రభుత్వం విజ్ఞప్తి అందింది
స్టీల్‌ప్లాంట్‌ పెట్టుబడుల ఉపసంహరణ ఆలోచనను పున్ణపరిశీలించాలని ఏపి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి అందిందని కేంద్ర ఆర్థిక మంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కరాడ్‌ తెలిపారు. రాజ్యసభలో టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 100 శాతం ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సిసిఇఎ) నిర్ణయం తీసుకున్న తరువాత, ప్రణాళికలను పున్ణపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలుసార్లు విజ్ఞప్తి చేసిందని తెలిపారు.

భీమిలి-భోగాపురం రోడ్డు అభివద్ధి ప్రతిపాదనలు అందలేదు
పర్యాటక రంగం కోసం భీమిలి-భోగాపురం రహదారిని అభివద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమకు ఎటువంటి ప్రతిపాదన అందలేదని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. రాజ్యసభలో వైసిపి ఎంపి వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

అమిత్‌ షాతో రఘురామ భేటీ
కేంద్ర మంత్రి అమిత్‌ షాతో నర్సాపురం ఎంపి రఘురామ కష్ణరాజు భేటీ అయ్యారు. ఏపిలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్‌ సమావేశాలపై చర్చించారు. ప్రత్యేక హౌదా అంశంపై సిఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమని రఘురామ ప్రకటించారు. ''నాపై అనర్హత వేటు పడదు. మీ బెయిల్‌ రద్దు చేయమని అనడం రాజద్రోహం ఎలా అవుతుంది. వాట్సాప్‌లో చాటింగ్‌ బయట పెట్టామని అంటున్నారు. నా ఫోన్‌ పోలీసులు తీసుకున్నారు. పెగసెస్‌ సాఫ్ట్‌వేర్‌ మీరు తెప్పించారని అంటున్నారు. మీరు చాలా మందిపై వాడారని అంటున్నారు, మీరు కేంద్రం అనుమతి తీసుకున్నారా?'' అని రఘురామ ప్రశ్నించారు.