Nov 27,2022 21:44

మడకశిర సర్కిల్‌ కార్యాలయం

ప్రజాశక్తి - మడకశిర : శాంతి భద్రతల పరిరక్షణలో ముందు ఉండాల్సిన పోలీస్‌శాఖకు చెందిన మడకశిర సర్కిల్‌ వివాదాలకు కేంద్రంగా మారింది. ఏకంగా సర్కిల్‌ స్థాయి అధికారులే విఆర్‌కు వెళుతున్నారు. ఇది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీసు వ్యవస్థపై ఈ ప్రాంతంలో నమ్మకం సడలిపోతోంది. కర్నాటక సరిహద్దులో ఉన్న ఈ సర్కిల్‌ సమస్యాత్మక ప్రాంతంగా ఉంది. గతంలో సరిహద్దు అవతల జరుగుతున్న మొబైల్‌ గ్యాంబ్లింగ్‌, మట్కా నేడు ఆయా మండల కేంద్రాలకు కూత వేటు దూరంలో పుట్టగొడుగుల వెలుస్తూ రోజు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్న వైనం కలవర పెడుతోంది. అంతేకాకుండా ఏ సర్కిల్‌ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చిన పట్టుమని పది నెలలు గడవకముందే విఆర్‌కు వెళ్లడమో, లేక బదిలీ కావటమో జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ పని చేసే అధికారుల విధి నిర్వహణ కత్తిమీద సాములా తయారవుతోంది. ఇక్కడ పనిచేయాలంటే ఖాకీ దుస్తులు పక్కన పెట్టాలి, లేదా ఖాకీ ముసుగులో ఖద్దర్‌ వేసుకుంటే తప్ప పనిచేయలేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్న అభిప్రాయాలు అధికారుల్లో వెల్లడవుతున్నాయి. ఇటీవల అంగన్వాడీ పోస్టుల నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టిడిపి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.ఈ నేపథ్యంలో పరస్పర ఆరోపణలు తారస్థాయికి చేరి పాలక, ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ల ముట్టడికి దారితీశాయి. ఈ విషయంలో పాలక నేతకు, సిఐకు మధ్య కొద్ది పాటి మనస్పర్ధలు చోటుచేసుకున్నాయన్న వ్యాఖ్యానాలు విన్పించాయి. ఈ నేపథ్యంలోనే సర్కిల్‌ స్థాయి అధికారికి విఆర్‌ వేటు పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇది ఇలా ఉండగా ఐదు సంవత్సరాల వ్యవధిలో వచ్చిన ప్రతి సిఐ విఆర్‌కు వెళ్తుండడం ఆ శాఖ సిబ్బందిలో గుబులు రేపుతోంది. అధికారి వచ్చి బాధ్యతలు చేపట్టి పట్టు బిగించే లోపే ఇలా విఆర్‌కు వెళుతుండటం ఆ శాఖ సిబ్బందిలో ఆందోళన నెలకొంది. దీంతో పాటు ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం సడలుతోంది. ఓ అధికారి ఇక్కడ పని చేయాలంటే కేవలం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మెలగాల్సిన పరిస్థితి ఉందన్న వాదనలు వినపడుతున్నాయి. విధినిర్వహణలో న్యాయం వైపు కాకుండా అధికార పార్టీ వైపు మొగ్గుచూపితే ప్రయివేటు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. ప్రస్తుతం విఆర్‌ వేటుకు సిఐ నాగరాజు రావు గురయ్యారు. అంత కు మునుపు పనిచేసిన సిఐలు శ్రీరామ్‌, దేవానంద్‌ , రాజేంద్రప్రసాద్‌, దేవేంద్ర కుమార్‌, శుభకుమార్‌ ఇలా ప్రతి ఒక్కరూ వి ఆర్‌కు వెళ్లడం ఆ శాఖలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇదే బాటలో ఎస్‌ఐలు సైతం వెళుతూ ఉండడం గమనార్హం. తాజాగా రెండు పర్యాయాలు శేషగిరి పై వి ఆర్‌ వేటు పడింది. అదేవిధంగా శరత్‌చంద్ర, గుడిబండ మస్తాన్‌, సుదాకర్‌ యాదవ్‌ ఇలా విఆర్‌ కు వెళుతుండడం చూస్తే ఇక్కడ పని చేసిన అధికారుల విధి నిర్వహణపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల చర్యల మూలానా వీరిపై ప్రజల్లో అనుమానాలను తలెత్తేలా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.