- లక్ష్యంలో సగమే ప్రొక్యూర్‌మెంట్ .. అందులో సగం లోపే ఆర్‌బికెలకు .. స్లోపై అనుమానాలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి - ఈ తడవ సబ్సిడీ వేరుశనగ విత్తనాల సేకరణలో జాప్యం నెలకొంది. నిర్ణయించిన లక్ష్యంలో ఇప్పటికి సగం కూడా సేకరించ లేదు. సేకరించిన వాటిలో పంపిణీ నిమిత్తం గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) వద్దకు చేర్చినవి సగానికి కంటే తక్కువే. మే మాసం ముగుస్తున్నప్పటికీ సేకరణ వేగం పుంజుకోకపోవడంపై రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉండగా ఒక పథకం ప్రకారం సేకరణ ప్రక్రియ నెమ్మదించిందని, ఒకటి రెండు వర్షాలు పడితే రైతులు విత్తనాల కోసం వెతుకులాట ముమ్మరం చేస్తారని, సమయం చూసుకొని అప్పుడు నాసిరకం, నాణ్యతా ప్రమాణాలు పాటించని విత్తనాలను రైతులకు అంటకట్టవచ్చని ఆలోచన చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
ఆర్‌బికెలకు ఇంకా తక్కువ
రానున్న ఖరీఫ్ కోసం రాయలసీమ జిల్లాల్లో 3.29 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను సబ్సిడీపై అందించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ మారు రైతుల నుండి కాకుండా టెండర్లపై వ్యాపార సంస్థల నుండి సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 1.5 లక్షల క్వింటాళ్లనే సేకరించారు. ఇంకా 1.79 లక్షల క్వింటాళ్లను సేకరించాలి. ఆర్‌బికెలలో ముందస్తు రిజిస్ట్రేషన్లు, ముందస్తుగా నాన్-సబ్సిడీ అమౌంట్ చెల్లించిన రైతులకు కొన్ని రోజుల అనంతరం విత్తనాలను అందజేస్తున్నారు. ఆర్‌బికెలకు చేరుకున్న విత్తనాలు మహా అయితే 60-70 వేల క్వింటాళ్ల లోపేనని చెబుతున్నారు. రెండు మూడేళ్ల నుండి మే మూడవ వారంలో వేరుశనగ విత్తనాల పంపిణీ మొదలు పెడుతున్నారు. అనంతపురంలో తొలుత పంపిణీ ప్రారంభమయ్యేది. ఈ సారి మే 26కు కూడా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పంపిణీ మొదలు కాలేదు. ఆర్‌బికెలలో రిజిస్ట్రేషన్లు మాత్రం జరుగుతున్నాయి. ఉమ్మడి కర్నూలులో పంపిణీ ఈ నెల 28న ప్రారంభిస్తారని ఎపి సీడ్స్ ముఖ్య అధికారి ఒకరు వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో విత్తన సేకరణ సాగుతోంది. దాదాపు జూన్ నెలాఖరు వరకు పంపిణీ జరుగుతుందని, అప్పటికి లక్ష్యాన్ని చేరుకుంటామని ఉన్నతాధికారులు ఆశాభావంతో ఉన్నారు.
సరైన సమయం కోసం..
సేకరణలో నెలకొన్న జాప్యంపై అనుమానాలొస్తు న్నాయి. వర్షాలు పడేవరకు సేకరణ నెమ్మదిగా జరిపి, డిమాండ్ తీవ్రమైన సమయంలో ఏది పడితే ఆ విత్తనం సరఫరా చేయొచ్చని, ఆ సమయంలో తనిఖీలు పెద్దగా ఉండవని ట్రేడర్లు ఆలోచిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. 'సరైన' సమయం కోసం ఎదురు చూస్తున్నారని, అందుకు కొందరు ఉన్నతాధికారులు సైతం మద్దతిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. ఆర్‌బికెలలో విత్తనాల కోసం ముందే నాన్-సబ్సిడీ అమౌంట్ చెల్లించమనడంతో రైతుల చేతుల్లో డబ్బుల్లేక రిజిస్ట్రేషన్లకు ముందుకు రావట్లేదని, సబ్సిడీ విత్తనాల ధరలు ఎక్కువగా ఉండటం సైతం రైతుల అనాసక్తికి ఒక కారణమని చెబుతున్నారు.










