ప్రజాశక్తి, కదిరి టౌన్ : వైసిపి దుర్మార్గపు విధానాలను తిప్పికొడదామని మాజీ మంత్రి, టిడిపి జోనల్ ఇన్‌ఛార్జి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈనెల 17న ఉమ్మడి అనంతరపురం జిల్లాలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో యాత్రపై చర్చించేందుకు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం పట్టణంలోని పివిఆర్ పంక్షన్‌హాల్‌లో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ వైసిపికి చెందిన 60 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 17 వ తేదీన కదిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ పాదయాత్ర దిగ్విజయం అయ్యేలా కృషి చేయాలని సూచించారు. వైసిపి ప్రభుత్వం పాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 9 కేసులు నమోదు చేయించారని అన్నారు. లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వైసిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు.కదిరి పట్టణంలో సిఐ దుర్భూషలాడుతూ టిడిపి శ్రేణులే లక్ష్యంగా పెట్టుకుని వారిని ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. టిడిపి నాయకులపైనా, పాత్రికేయులపైనా అక్రమంగా కేసులు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి అరాచక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రధాన నాయకులు బీదరవిచంద్ర, పయ్యావుల కేశవ్, పార్థసారధి, పరిటాల సునీత, నిమ్మలకిష్టప్ప, పరిటాల శ్రీరామ్, సవివ, గుండుమల తిప్పేస్వామి, ఈరన్న, అంబికా కృష్ణమూర్తితో పాటు టిడిపి అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










