వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
ప్రజాశక్తి-ఒంటిమిట్ట
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పుష్పయాగం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన పుష్పయాగం రాత్రి 9 గంటలకు ముగిసింది. ఇందులో తులసీదళాలు, మల్లెలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, మొగలి తదితర 11 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దాతలు 2.5 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్ బాబు, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.










