వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను సాధించాలి జిల్లా సంప్రదింపులు, సమీక్షా కమిటీల సమావేశంలో కలెక్టర్ డిల్లీరావు
ప్రజాశక్తి - విజయవాడ : వార్షిక రుణ ప్రణాళికను తుచ తప్పకుండా అమలు చేసేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు సూచించారు. జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం మంగళవారం నగరంలోని కలెక్టర్ విడిది కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్, కమిటీ చైర్మన్ ఎస్.ఢిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డులు ఉన్న 4,510 మంది కౌలు రైతులకు రూ.39 కోట్లు మంజూరు లక్ష్యానికి గాను ఇప్పటివరకు కేవలం రూ.5 కోట్లు మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. ఈఏడాది జిల్లాలో 20,557 మంది చిరువ్యాపారులకు రుణాలు మంజూరు లక్ష్యంగా నిర్ధేశించామని, ఇప్పటివరకు 19,464 మందికి రుణాలు మంజూరు చేసి 89 శాతం లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమని అన్నారు. మంజూరైన ప్రతి ఒక్కరికి తక్షణమే రుణాలు పంపిణీ చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాలలో ప్రాధాన్యత రంగంలో రూ.19 వేల కోట్ల లక్ష్యానికి గాను రూ.7,792 కోట్లు మంజూరు చేసి 41 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. ప్రాధాన్యేతర రంగాలకు రూ.20 వేల కోట్ల లక్ష్యానికి గాను రూ.19,584 కోట్లు మంజూరు చేసి 98 శాతం లక్ష్యం సాధించడం పట్ల కలెక్టర్ బ్యాంకర్లను అభినందించారు. మొత్తంగా రూ.39 వేల కోట్లకుగాను ఇప్పటివరకు రూ.27,376 కోట్లు మంజూరు చేసి 70 శాతం లక్ష్యం పూర్తిచేసినట్లు చెప్పారు. వ్యవసాయ రంగానికి రూ.8,500 కోట్ల రుణ లక్ష్యానికిగాను రూ.3,249 కోట్లు మంజూరు చేసి 38 శాతం మాత్రమే ప్రగతి సాధించారని వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.7,800 కోట్ల లక్ష్యానికిగాను రూ.4,201 కోట్లు మంజూరు చేశారన్నారు. పాడిరైతులు పాడిపశువులను కొనుగోలు చేసుకొనేందుకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలను మంజూరు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు త్రిఫ్ట్ రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకర్లు ప్రత్యేక దష్టి పెట్టాలని సూచించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ కె. ప్రియాంక, యూబీఐ రీజనల్ అధికారి ఐఎస్‌ఎస్ మూర్తి, ఆర్బీఐ ఎజియం ఎం.జడ్. రెహ్మాన్, నాబార్డ్ డిడియం మళింద రెహ్మాన్, యుకో బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఎంవి రామిరెడ్డి, పంజాబ్ బ్యాంకు ఎజియం మహౌజ్ కుమార్, కేడిసిసి బ్యాంకు డిజిఎం పి.వరలమ్మ, సప్తగిరి గ్రామీణ బ్యాంకు చీఫ్ మేనేజర్ ఎంవి రెడ్డి, యాక్సిస్ బ్యాంకు సీనియర్ మేనేజర్ పి.కపాజి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి విద్యాసాగర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.నాగమణమ్మ తదితరులు పాల్గొన్నారు.










