May 30,2022 08:31
  • రెండవ రోజు మహాసభ చర్చలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- మల్లు స్వరాజ్యం నగర్‌ (అనంతపురం) : ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం 22వ మహాసభ రెండవ రోజు ఆదివారం కార్యదర్శి నివేదికపై ప్రతినిధులు ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు. గత మహాసభ నుండి ఇప్పటి వరకు నిర్వహించిన పోరాటాలు, ఉద్యమ గమనం, సంఘ విస్తరణ, తదితర అంశాలు ప్రతినిధుల్లో ఉత్తేజం నింపాయి. వివిధ సంఘాల నేతల సౌహార్ద సందేశాలు, రైతాంగ సమస్యలు-ఐక్య ఉద్యమాలు- ఆవశ్యకతపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న రైతు నేతల సందేశాలు భవిష్యత్తు దిశా నిర్దేశం చేశాయి. మోడీ సర్కారు తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన మహత్తర పోరాటం అప్పటి వరకు కాస్త స్తబ్దంగా ఉన్న సంఘాన్ని తట్టి లేపిందని, రైతుల్లోకి చొచ్చుకెళ్లడానికి ఎంతగానో తోడ్పడిందని, సంఘ ప్రతిష్ట ఇనుమడించిందని చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు. సంఘ జోక్యం, నిర్వహించిన ఆందోళనలు రైతాంగానికి లాభం చేకూర్చాయని, పలు విజయాలు తెచ్చిపెట్టాయని వివరించారు. కరోనా సమయంలో చేసిన సేవా కార్యక్రమా లపై రైతులు, ప్రజల నుండి అభినందనలు వ్యక్తమయ్యా యని తెలిపారు. రానున్న కాలంలో సమస్యలను అధిగమించి ఉద్యమ విస్తరణ, సభ్యత్వం పెంపు, రైతు సమస్యలపై ఐక్య పోరాటాల కర్తవ్యాన్ని స్వీకరించారు.
   

హనుమంతు, సూరి (కర్నూలు) : కరువుపై 18 మండలాల్లో ప్రచారాందోళనలు నిర్వహించాం. నిరాహార దీక్షలు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి చేశాం. పైప్‌లైన్‌ వలన భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం పెంచేలా ఆందోళనలు చేశాం. మార్కెట్‌, పంటల కొనుగోళ్లు, స్థానిక సమస్యలపై రైతులను కదిలించాం.

రామచంద్రుడు, రాజేశ్వరరావు (నంద్యాల) : పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, ఆన్‌లైన్‌, ఇ-క్రాప్‌ సమస్యలపై పని చేశాం. పంటల కొనుగోళ్లపై ఆందోళనలు చేశాం. జిల్లా విభజన వలన కొత్త మండలాలకు సంఘం విస్తరించింది.

సూర్యనారాయణ, పశ్చిమగోదావరి : పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా పరిహారం కోసం ఆందోళనలు చేశాం. గిట్టుబాటు ధరలు, ఎరువుల, పురుగు మందుల సమస్యలపై రైతుల్లో కదలిక వచ్చింది.

చల్లా జగన్‌, విజయనగరం : నీటి వనరులపై ఆందోళనలు చేశాం. తాడిపూడి నుండి వైజాగ్‌కు నీటిని తరలించడంపై రెండు మండలాల రైతులను కూడగట్టి అడ్డుకున్నాం. ఆయిల్‌ పైప్‌లైన్‌ నిర్వాసితుల పరిహారం పెంచేలా ఆందోళనలు చేశాం. పోలవరం ఎడమ కాల్వ భూనిర్వాసితుల పరిహారం కోసం పోరాడాం. చెరకు రైతుల బకాయిల కోసం ఆందోళనలు చేశాం.
శ్రీకాకుళం, భాస్కరరావు : నీటి తీరువా వసూళ్లను ప్రతిఘటించాం. ఏటిగట్టు గ్రామాల భూముల సమస్యపై పోరాడాం. ఆందోళనల్లో నలుగురు రైతులపై పోలీస్‌ కేసులయ్యాయి.

రాజారామిరెడ్డి, శివారెడ్డి, అనంతపురం : రైతు రుణాలను అసలు, వడ్డీతో సహా కట్టమని బ్యాంకులు ఒత్తిడి చేయగా ఆందోళనలు చేసి వడ్డీ మాత్రమే తీసుకునేలా చేశాం. 31 మండలాల్లో రైతు కూలీ రక్షణ యాత్ర చేశాం. హైవేలో భూములు కోల్పోయిన వారికి మూడు రెట్ల అధిక పరిహారం ఇప్పించాం. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆదుకోవడంలో సహాయపడ్డాం. పండ్ల తోటల రైతు సమస్యలపై కేంద్రీకరించి పని చేసి కొన్ని విజయాలు సాధించాం.

అప్పారావు, పార్వతీపురం మన్యం : చెరకు రైతు బకాయిల కోసం ఎంసిఎస్‌ సుగర్‌ ఫ్యాక్టరీపై పోరాడాం. ఆరుగురు అరెస్టయ్యారు. మహిళలు సహా 90 మందిపై పోలీస్‌ కేసులయ్యాయి. పెదగడ్డ, వెంగళరాయసాగర్‌, తదితర ప్రాజెక్టుల నీటి కోసం ఆందోళనలు జరిగాయి. ధాన్యం కొనుగోలు కోసం ఉద్యమించాం. ఏనుగుల దాడు ల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని, ఏనుగులను తరలించాలని ఆందోళనలు చేశాం.

చంద్రశేఖరరావు, బి వెంకటరెడ్డి, ఎన్‌టిఆర్‌ జిల్లా : నకిలీ మిర్చి నారుతో నష్టపోయిన రైతులకు పరిహారం కోసం ఆందోళనలు జరిగాయి. గ్యాస్‌, ఆయిల్‌ పైప్‌లైన్‌, ఎలక్ట్రిక్‌ లైన్‌ల నిర్వాసితులకు అండగా నిలబడ్డాం.

అప్పారావు, కాకినాడ : ఎస్‌ఇజెడ్‌, దివిస్‌, తాండవ సుగర్స్‌ చెరకు రైతుల బకాయిలపై నిర్బంధాలకు తలొగ్గ కుండా ఆందోళనలు నిర్వహించాం. తీరప్రాంతం కావడం తో పైపులైన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. తుపాన్లు, వరదల వలన పంట నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి.

శివశంకర్‌, కృష్ణా : బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో నాసిరకం విత్తనాలిచ్చిన కంపెనీ నుండి రైతులకు పరిహారం ఇప్పించేందుకు ఆందోళనలు చేశాం.

శివప్ప, సత్యసాయి జిల్లా : వేరుశనగ రైతులకు పరిహారం ఇవ్వాలని, రైతులకు డ్రిప్‌లు, స్ప్రింక్లర్లను రాయితీపై ఇవ్వాలని 15 రోజులపాటు బస్‌యాత్ర చేశాం.

చర్చల్లో తిరుపతి నుండి బత్తెయ్య, చిన్నపరెడ్డి, ప్రతాపరెడ్డి (ప్రకాశం), డి శివసాంబిరెడ్డి (గుంటూరు), వెంకటేష్‌ (రాజమండ్రి), ఎస్‌ నాయుడు (అనకాపల్లి), ఒ కృష్ణయ్య, కారు వెంకటయ్య (నెల్లూరు), వణుకూరి శ్రీనివాసరెడ్డి (బాపట్ల), చినబాబు (అల్లూరి జిల్లా), సురేష్‌బాబు (పల్నాడు) పాల్గొన్నారు.