ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్‌ఆధ్వర్యంలో పోరంకిలోని గ్రీన్ స్కూల్‌లో ఆదివారం ఉదయం జిల్లా స్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి బాల బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ రమ్యచ ఎస్‌ఆర్‌ఆర్ చెస్ కోచింగ్ అకాడమి అధ్యక్షులు జె. సౌజన్య పాల్గొని విజేతలకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ చెస్ అసోసియేషన్ మేనేజర్ సుమన్, ఆనంద్, కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ మేనేజర్ రామకృష్ణ, కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ యన్.యం. ఫణికుమార్‌లు పాల్గొని విజేతలను అభినందించారు. ఈటోర్నమెంట్‌లో ఎంపికైన విద్యార్థులు ఈనెల 24వ తేదీన శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో కృష్ణా జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు. ఈసందర్భంగా ఎంపికైన వారి వివరాలను తెలియచేశారు.
విజేతల వివరాలు.. : అండర్ -6 బాలుర విభాగంలో డూండి కృష్ణ మోహన్, బాలికల విభాగంలో డివిషా చౌదరి ప్రథమ స్థానం సాధించారు. అలాగే అండర్ -8లో బాలికల విభాగంలో వెనోరి సామ్, బాలుర విభాగంలో మోక్షిత్ రామ్ ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. అలాగే అండర్ -10 బాలికల విభాగంలో గుణశ్రీ, బాలుర విభాగంలో జారు ప్రజిత్‌లు మొదటి స్థానం సాధించగా, అండర్ -12 లో బాలికల విభాగంలో జారు ప్రహర్ష, బాలుర విభాగంలో హర్షిత్ సాయి ప్రథమ స్థానం సాధించారు. అండర్ -14లో బాలికల విభాగంలో లిఖిత ఎం., బాలుర విభాగంలో జితేష్ నాగ్ మునగాల ప్రతమ స్థానం సాధించారు. అండర్ -16లో బాలుర విభాగంలో కె.సందీప్ ప్రథమ స్థానం సాధించారు.










