ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : జూనియర్ చెస్ అకాడమి, ది విజయవాడ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగిన ర్యాంకింగ్ చెస్ పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 70 మంది విద్యార్థులు ఈపోటీల్లో పాల్గొన్నారు. పోటీలు అండర్ -6, అండర్ -8, అండర్ -10, అండర్ -12 విభాగాలలో బాల, బాలికలకు పోటీలు జరిగాయి. ఉదయం పోటీలను ప్రభుత్వ ఆస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.రాజశేఖర్, ఫెడరల్ బ్యాంక్ గవర్నరుపేట శాఖ చీఫ్ మేనేజర్ సాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెస్ ఆడటం వలన విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ చెస్ ఆడాలని కోరారు. ఈపోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారు అక్టోబరు 24వ తేదీన నగరంలో జరుగనున్న రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, ట్రోఫీలు, మెడల్స్ అందచేశారు. ఈపోటీలను అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు ఎం.డి. అక్భర్ పాషా, మందుల రాజీవ్ నిర్వహించారు.










