Sep 30,2023 15:49
  • రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న
  • కాకినాడ ధర్నాచౌక్ వద్ద ధర్నా చేపట్టిన ఎస్సై అభ్యర్థులు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : ఎస్సై మెయిన్ పరీక్షకు సన్నద్ధం కావడానికి రెండు నెలలు గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎస్సై పోస్టుల అభ్యర్థులు శనివారం కాకినాడ కలెక్టరేట్ సమీపంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 550 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షపై ఉన్న కోర్టు కేసులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎత్తు, కొలతలలో తేడాలను సవరించి మళ్లీ కొలవాలని కోరారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ ధర్నాలో అభ్యర్థులు తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. పోలీస్ అధికారులు సైతం నిరుద్యోగుల్లో గందరగోళానికి కారణం అవుతున్నారని విమర్శించారు. ఫిజికల్ ఈవెంట్స్ మొయిన్ పరీక్షలకు ఎంత సమయం వ్యవధి ఉండాలో కూడా ప్రభుత్వానికి, ఉన్నత పోలీస్ అధికారులకు తెలియకపోవడం శోచనీయమని ఎద్దేవా చేశారు. ఎస్సై అభ్యర్థులకు మొయిన్ పరీక్షను కనీసం 2నెలలు పాటు వాయిదా వేయాలని లేని పక్షంలో 30వేల మంది అభ్యర్థులతో కలిసి డిజిపి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోలీస్ కానిస్టేబుల్స్ 6100, ఎస్నై 410 పోస్టులకు 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదల చేసిందని, అయితే ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల తర్వాత తక్కువ పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. బోర్డు షేడ్యూల్ ప్రకారం మార్చిలో ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన ఎస్సై అభ్యర్థులకు ఫీజికల్ ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉందన్నారు. కానీ ఎంఎల్సి ఎన్నికలు కారణంగా వాయిదా వేశారన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు రేంజ్ లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఇవి సెప్టెంబర్ 25న జరిగాయన్నారు.ఇదిలా ఉండగా అక్టోబర్ 14,15 తేదీల్లో మొయిన్స్ పరీక్షలు ఉండటంతో ఫిజికల్ ఈవెంట్స్ కు మొయిన్ పరీక్షలకు కేవలం 20రోజులు మాత్రమే ప్రీపేరేషన్ కు గడువు ఉంటుందన్నారు.దీని వల్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని గుర్తు చేశారు. 

ఏపీ ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధికి మాట్లాడుతూ సిలబస్ విస్తృతి రీత్యా కనీసం 2 నెలలు అయినా గడువు పెంచాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షల్లో 8 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారన్నారు. వారి సమస్యలను పరిష్కరించి వారి సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎత్తు, కొలతలలను కొలిచే సెన్సార్ వల్ల 2018లో ఈవెంట్స్ లో 168 సెంటీమీటర్లు ఎత్తు ఉండి అర్హత సాధించిన అభ్యర్థి ఈ దఫా నిర్వహించిన ఈవెంట్స్ లో 166 సెంటీమీటర్లు ఎత్తున మాత్రమే సెన్సార్ చూపించడం వల్ల అర్హత కోల్పోయాడని గుర్తు చేశారు. ఇటువంటి తప్పులు అనేకమంది అభ్యర్థుల విషయంలో జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీని వల్ల వేలాది మంది అభ్యర్ధులకు అన్యాయం జరిగిందన్నారు. ఎత్తు, కొలతలపై అనుమానం వ్యక్తం చేసిన అభ్యర్థులకు తిరిగి మ్యాన్ వాల్ గా ఈవెంట్స్ నిర్వహించాలని, ప్రస్తుతం అక్టోబర్ 14,15 నిర్వహించే ఎస్సై మొయిన్ పరీక్షలను 2నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా డివైఎఫ్ఐ నాయకులు టి.రాజా, విజయ్ కుమార్, పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.