* తల్లితండ్రులకూ బెదిరింపులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగాల భర్తీకోసం గళమెత్తిన యువతీయువకులపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అణచివేతకు దిగింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చలో తాడేపల్లి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు అడుగడుగునా ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం ముగిసిన 24 గంటల తరువాత నిర్బంధ తీవ్రతకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు నాలుగురోజుల ముందునుండే పోలీసులు విద్యార్థి, యువజన నేతలపై నిర్బంధానికి దిగారు. పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అనేకచోట్ల విద్యార్థినీలను సైతం లక్ష్యంగా చేసుకున్నారు. వారి తల్లితండ్రలను బెదిరించారు విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం ఇలా అన్ని జిల్లాల్లోనూ ఈ నిర్బంధకాండ కొనసాగింది.
రెండురోజల ముందునుండే విద్యార్థినుల ఇళ్లవద్ద
విజయనగరం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్ కన్వీనర్ సిహెచ్.పావని ఇంటి వద్ద కార్యక్రమానికి రెండు రోజుల ముందునుండే పోలీసులు పహరా కాశారు. పైగా వీరందరు మగపోలీసులే. ఇంటి నుండి బయటకు వెడితే వెంబడించేవారు. ఆమె తల్లిదండ్రులను పిలిపించి చలో తాడేపల్లికి వెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా సహాయ కార్యదర్శి బుజ్జమ్మనూ మగ పోలీసులు బెదిరించారు. అయితే, ఈ బెదిరింపులను వారు ఖాతరు చేయలేదు. ఏదోరకంగా విజయవాడకు చేరుకుని కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. గతంలో ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేసిన విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన పవన్ ప్రస్తుతం ఆటో నడుపుకుంటున్నారు. అతన్ని కూడా అరెస్టు చేశారు.
స్టేషన్లో నిర్బంధించి ...
విజయనగరానికే చెందిన విద్యార్థి నాయకుడు చంద్రశేఖర్‌ను 17వ తేదీ రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని మానాపురం పోలీస్‌స్టేషన్లో నిర్బంధించారు. తల్లితండ్రులు ఆరా తీస్తే అసలు తమకు తెలియనేతెలియదని, ఎక్కడికి వెళ్లాడో వెతుక్కోండని దబాయించారు. అయితే, చంద్రశేఖర్ తాను స్టేషన్లోనే ఉన్నట్లు ఆధారాలు వాట్సాప్ ద్వారా పంపించారు. దీంతో పోలీసులను గట్టిగా నిలదీయడంతో తాము తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నారు. అయితే, ఆ సమాచారాన్ని ఎందుకు పంపించావంటూ ఆ విద్యార్థిపై వేధింపులకు దిగారు. ఫోన్ లాక్కున్నారు. తాడేపల్లికి వెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందని తల్లితండ్రులను హెచ్చరించారు. గుర్ల పోలీసుస్టేషన్ పరిధిలోని విద్యార్థి నాయకుడు హరిని మూడు రోజులపాటు వేధింపులకు గురిచేశారు. కొత్తవలసకు చెందిన మరో నేత రాజు కుటుంబ సభ్యులను బెదిరించారు.

ఒక ఎస్‌ఐ.. నలుగురు కానిస్టేబుళ్లు !
విశాఖపట్నం నగర ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షులు బి.కుసుమ స్వగ్రామం స్వగ్రామం విజయనగరం జిల్లా కళ్లేపల్లి. విద్యాసంస్థలు మూతపడి ఉండటంతో కొంత కాలంగా ఆమె అక్కడే ఉంటున్నారు. ఈ విషయం తెలియడంతో ఆమె ఇంటిదగ్గర ఏకంగా నలుగురు కానిస్టేబుళ్లతో పాటు, ఒక ఎస్‌ఐ మొహరించారు. చలో తాడేపల్లి కార్యక్రమానికి రెండు రోజుల ముందు నుండే వీరి పహరా ప్రారంభమైంది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని తీవ్రస్థాయిలో నిరసన తెలియచేయడంతో వెనక్కి తగ్గారు. మళ్లీ 18వ తేది ఆమె ఇంటికి వెళ్లి విజయవాడ వెళ్తే పరిస్తితులు తీవ్రంగా ఉంటాయని ఆమె తల్లిని బెదిరించారు.
తీవ్రవాద ముద్ర!
శ్రీకాకుళం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి సిహెచ్.రాజుపై తీవ్ర వాద ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఆయన ఇంటికివెళ్లి తల్లితండ్రులకు 'మీ అబ్బాయి తీవ్రవాద కార్యక్రమాలు చేస్తున్నాడు' అని చెప్పారు. తాము చెప్పినట్టు వినకపోతే రౌడీషీట్ తెరుస్తామని బెదిరించారు.
ఎనిమిది కిలోమీటర్ల నడక
పోలీస్ నిఘాను తప్పించుకోవడానికి విశాఖపట్నం నగర ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్ధి ఎల్.జె నాయుడు అడ్డదారుల్లో ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సివచ్చింది.విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలుకు చెందిన ఆయనపై చలో తాడేపల్లికి వెళ్లవద్దంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. కదలికలపై నిఘా పెట్టారు. ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పినా వినలేదు. ఫంక్షన్ జరుగుతున్న సమయంలోనూ వెంటాడారు. చివరకు నాయుడు ఎలాగో తప్పించుకుని ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి, బస్సు ఎక్కి విజయవాడ చేరుకున్నారు.
ఇలా ఎన్నో.....
ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థి , యువజన నేతలను అడ్డుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేయని ప్రయత్నం లేదు. గుంటూరు జిల్లా తుమ్మడిపూడిలో యువజన నాయకుడు బి.చిరంజీవి ఇంటికెళ్లి పోలీసులు బెదిరించారు. పొన్నూరు డివిజన్ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి ప్రవీణ్‌ను రెండు రోజుల ముందే అదుపులోకి తీసుకున్నారు. బాపట్లకు చెందిన విద్యార్థి అమర్‌నాథ్ ప్రత్తిపాడు పరిధిలోని కోచింగ్ సెంటర్లో ఉంటున్నాడు. బాపట్ల పోలీసులు ప్రత్తిపాడు పోలీసులకు సమాచారం ఇస్తే అర్ధరాత్రి వెళ్లి నోటీసులిచ్చారు. కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదని బెదిరించారు. కర్నూలు జిల్లా కార్యదర్శి నగేష్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేంద్ర, హుస్సేన్‌భాషా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా ఫోన్లు ట్యాప్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నాయకులు వాహనాలు దిగి నడుచుకుంటూ చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి మళ్లీ రోడ్డుపైకి చేరుకున్నారు. నెల్లూరు జిల్లాలో గూడూరు, చేజేర్ల ఆత్మకూరు, నెల్లూరు సిటీలో యువజన సంఘం నాయకులకు 17వ తేదీ మధ్యాహ్నం నోటీసులు ఇచ్చారు. 18వ తేదీన వెతుకులాట మొదలుపెట్టారు. రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో తనిఖీలు చేపట్టి అరెస్టులు చేశారు.










