Nov 13,2020 07:41

        రాష్ట్రం లోని సుమారు మూడు లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వం నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం దారుణం. గ్రామ పంచాయతీల్లోని పారిశుధ్య కార్మికుల మొదలు రాష్ట్ర సచివాలయంలో విధులు నిర్వర్తించే వైట్‌ కాలర్‌ ఉద్యోగుల వరకూ అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, డాక్టర్లు, పారా మెడికల్‌ వర్కర్లు...ఇలా అన్ని రంగాల్లో విస్తరించివున్న ఈ ఉద్యోగులు వేతన బకాయి బాధితులే! ఒకటి రెండు నెలలు కాదు కొన్ని శాఖల్లో పది నెలల పాటు జీతం బకాయి పెట్టడం సర్కారుకు తగదు. 'కోవిడ్‌ వారియర్లు'గా పేర్కొనేవారిలో వైద్యులు, నర్సులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బందికి ఏమాత్రం తీసిపోని రీతిలో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు జీతం బకాయి పెట్టడం అమానవీయం. రాష్ట్రంలోని 46 వేల మంది గ్రామ పంచాయతీ వర్కర్లకు సుమారు పది నెలలుగా జీతాల్లేవు. మునిసిపల్‌ వర్కర్లలో 38 వేల మందికి ఆయా మున్సిపాల్టీలనుబట్టి మూడు నుండి ఆరు నెలల జీతం బకాయిలున్నాయి. ఆరోగ్య ఎమర్జెన్సీ లాంటి ఈ రోజుల్లో మున్సిపల్‌ వర్కర్లకిచ్చే హెల్త్‌ ఎలవెన్సు సైతం నాలుగు నుండి పది నెలలపాటు బకాయి పెట్టడాన్ని ఏమనుకోవాలి? కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఐ మాస్క్‌ బస్సులను వివిధ ప్రాంతాలకు పంపి అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం మంచి విషయమే కాని ఆ సిబ్బందికి ఇప్పటి వరకూ వేతనాలు ఇవ్వకపోవడం అన్యాయం. ఇప్పటికే ఆందోళనను ప్రారంభించిన శ్రామికులు సర్కారు స్పందించకపోతే సమ్మెకు దిగుతామని ప్రకటించారు.
        జీతాలు బకాయి పడినా ఉద్యోగానికి భద్రత ఉందా అంటే అదీ చెప్పలేని పరిస్థితి. వైసిపి ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నెలవారీగా పొడిగిస్తూ వచ్చారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినా అందులో నమోదైనవారికి సైతం ఏడాదికోసారి పొడిగింపు తప్పనిసరి చేశారు. ప్రైవేట్‌ ఏజెన్సీ పోయి ప్రభుత్వ కార్పొరేషన్‌ వచ్చిందే తప్ప ఉద్యోగులకు మాత్రం పూర్తి భద్రత లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను మార్చి 2021 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు బుధవారంనాడు జిఓ 2741 జారీ చేశారు. కాని అది కేవలం నాలుగు శాఖల్లో పని చేస్తున్నవారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొనారు. ఆ నాలుగు శాఖలకే ఎందుకు? మిగతా వారి సంగతేమిటి? స్పష్టత లేదు. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కష్టాలిలా వుంటే ప్రభుత్వ శాశ్విత ఉద్యోగులకూ చాలా సమస్యలున్నాయి. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసినా కమిటీల మీద కమిటీల ఏర్పాటుతో కాలయాపన తప్ప వైసిపి సర్కారు నిర్దిష్ట చర్య తీసుకోలేదు.                  ఉద్యోగుల వేతన సవరణ కమిషన్‌ గడువు ముగిసిపోయినా ఇంకా కొత్తది ప్రకటించలేదు. ఈ లోగా ప్రకటించే మధ్యంతర భృతి ఊసే లేదు. వాటికి తోడు రెండేళ్లుగా బకాయి పడిన ఐదు విడతల డిఎ చెల్లిస్తామని నవంబర్‌ 4న జిఓ జారీ చేసిన సర్కారు 48 గంటలు తిరగకుండానే దాన్ని నిలిపివేయడం ఘోరం.
       ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ విపత్తు కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిన మాట నిజమే! ఖజానా ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఇన్ని ఒడుదుడుకుల మధ్య నవరత్నాలు వంటి ప్రభుత్వ ప్రకటిత సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదే. సర్కారు పెద్దలకు అంతటి శ్రద్ధ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు పట్ల కూడా ఉండాలి కదా! ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పని చేసేది ఉద్యోగులు. వారి పట్ల పాలకులు ఇలా వ్యవహరిస్తే సర్కారు సేవలు జనానికి నిరాటంకంగా సాగడానికి అవరోధాలు ఏర్పడక మానవు. 'జీతం లేని కొలువు' పట్ల ఎవరికి మక్కువ వుంటుంది? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులకు బకాయిలేవీ లేకుండా పూర్తి వేతనాలు చెల్లించాలి. అలాగే వారికి సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగుల పిఆర్‌సి నియామకం, సిపిఎస్‌ రద్దు వంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలి. అలా కాకపోతే ఇప్పటికే ఐమాస్క్‌ బస్‌ ఉద్యోగులు దిగినట్టే ఒక్కో తరగతివారు ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తే ప్రజలకు సేవలు చతికిలపడతాయి. అది సర్కారు స్వయంకృతమే అవుతుంది.