Nov 23,2021 07:10

    సాధారణ స్థాయిలో కురిసిన వర్షాలు రాయలసీమను అతలాకుతలం చేశాయి. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఊళ్లూ, యేళ్ళూ ఏకమయ్యాయి. గ్రామాలకు గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. వందల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు వరద నీటి ఉధృతికి దెబ్బతినిపోయాయి. విద్యుత్‌, నీటి సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. అపార ఆస్తి నష్టంతోబాటు ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. గత నాలుగు రోజుల్లో చిత్తూరులో నల్గురు, కడపలో 13 మంది, అనంతపురంలో ఏడుగురు మొత్తంగా 24 మంది చనిపోయారు. మరో 17 మంది జాడ తెలియరాలేదు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, వైమానిక దళం, అగ్నిమాపక దళ సిబ్బంది రంగంలోకి దిగి 35 మందిని కాపాడారు. లేకుంటే ప్రాణనష్టం ఇంకా పెరిగి ఉండేది. ప్రాథమిక అంచనా ప్రకారం 2.3 లక్షల హెక్టార్లలో వ్యవసాయం, 0.19 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినిపోయాయి. వరద పూర్తిగా తగ్గితే కానీ ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావు. రోడ్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇతర మౌలిక సదుపాయాలకు భారీగానే నష్టం వాటిలింది. సాధారణంగా ఇటువంటి విపత్తులు కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుంటాయి. కరువు సీమగా పేరుపడ్డ రాయలసీమలో ఇటువంటి వైపరీత్యాలు రావడం గత 60 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. వర్షాలు ఆగి రెండు రోజులైనా ఇప్పటికీ చాలా గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. భూగోళం వేడెక్కడం వల్ల వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ప్రభావం దుష్పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. ఇటువంటి విపత్తులను రాకుండా ఆపగలిగే శక్తిని మానవాళి ఇంకా సంతరించుకోకపోయినా, వీటిని ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు. భారీ వర్షాలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురంలో చోటుచేసుకున్న కొన్ని విషాదకర ఘటనలకు ప్రకృతి వైఫల్యం అనేదానికన్నా మానవ వైఫల్యమే కారణమని చెప్పాలి. చెరువులు, జలాశయాలను భూ బకాసురులు, రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా ఆక్రమించేసుకుని, అక్కడ బహుళ అంతస్తుల భవంతులు కట్టేస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి బదులు వాటిని క్రమబద్ధీకరించేందుకు రకరకాల స్కీములు తెస్తుంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన టెంపుల్‌ టౌన్‌ తిరుపతి నాలుగు రోజుల వర్షాలకే జలాశయంగా మారిపోయింది. తిరుమల ఘాట్‌ రోడ్డు ఫుట్‌పాత్‌లు పలుచోట్ల కూలిపోవడం, శ్రీవారి మెట్లపై వరద నీరు జలపాతాన్ని తలపించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోయింది. చెరువుల ఆక్రమణను నివారించడంలోను, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచడంలోను ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టుకు గండి పడడం, తిరుపతి లోని రాయల చెరువు గట్టు ఏ క్షణమైనా తెగే పరిస్థితి రావడానికి వీటి నిర్వహణలో అలసత్వమే కారణమని చెప్పక తప్పదు. అనంతపురం జిల్లా కదిరిలో నిర్మాణంలో ఉన్న పలు అంతస్తుల భవనం కూలిపోవడానికి వర్షాలకు తోడు పురపాలక సంస్థ నిర్లక్ష్యం కూడా కారణం. తుపానులను ఎలా ఎదుర్కోవాలో, బాధితులను ఎలా ఆదుకోవాలో కేరళలో ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తౌక్టే, షహీన్‌, యాస్‌ తుపానులు ఒక దాని తరువాత ఒకటి వచ్చి పడినా కేరళ వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఏరియల్‌ సర్వే జరిపిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వర్ష మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో ఏమూలకూ చాలదు. వరద బాధితుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలి. వరద బాధిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలి. మంచినీరు, మందులు, ఆహారం అందించడంలో ఎంత ఖర్చు అయినా వెనుకాడరాదు. రాష్ట్రానికి వరద సాయం అందించడంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిలదీయాలి. హుదూద్‌ సమయంలో రాష్ట్రానికి మొండి చెయ్యి చూపిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు అదే వైఖరినవలంభిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలి.