హైదరాబాద్ : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డి అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. పెద్దఎత్తున తన సైనికులు రేపు తెలంగాణ భవన్‌కు రావాలని పిలుపునిచ్చారు. సిఎం కెసిఆర్ కృషితో రైతులంతా సంతోషంగా ఉన్నారని, కాళేశ్వరం, ఎల్‌ఎండి జలాలతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని అన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిని విస్మరించారన్నారు. ప్రజా సమస్యల కోసం కాదు.. స్వలాభం కోసం ఆయన రాజీనామా చేసి బిజెపిలో చేరారని విమర్శించారు.










