Jul 20,2021 14:36

కరీంనగర్‌ : మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్‌తో తనకు ఉన్నది రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత కక్ష కాదని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాని చెప్పారు. ఆదివారం ఈటల కమలాపూర్‌ మండలంలో ప్రజాదీవెన యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఒక మంత్రి తనపై దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారని తనకు ఒకరు చెప్పినట్లు ఈటల అన్నారు. దీనిపై గంగుల స్పందిస్తూ మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. ఈటలకు ఎలాంటి భయాలు అవసరం లేదు. ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెట్టి బతికించుకుంటా. నాకు నేరచరిత్ర లేదు. దళిత బంధు కాదు.. రైతు బంధు పథకాన్ని కూడా ప్రభుత్వం హుజురాబాద్‌ నుంచే ప్రారంభించింది. ఎన్నికలకు, పథకాలకు సంబంధం లేదు' అని అన్నారు. ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందని అన్నారు. అయితే, ఈటల సానుభూతి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.