- చంద్రబాబు చేసిన తప్పేంటి?
- త్వరలో జనసేనతో జాయింట్ యాక్షన్ కమిటీ : అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్ : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా అక్టోబర్ 2న నారా భువనేశ్వరి ఒక్క రోజు నిరాహారదీక్ష చేస్తారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అదే రోజు రాత్రి ఏడు గంటలకు దేశం, రాష్ట్రంలోని ప్రజలు ఐదు నిమిషాలపాటు తమ ఇంట్లోని లైట్లు ఆర్పివేసి వరండాలోకి వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలపాలని కోరారు. నంద్యాలలో శనివారం జరిగిన టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అతి త్వరలో జనసేన పార్టీ నుంచి ఐదుగురిని, టిడిపి నుంచి ఐదుగురిని ఎంపిక చేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ కమిటీ ద్వారా క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్... మచిలీపట్నం పర్యటనలో టిడిపి శ్రేణులు, నాయకులు పాల్గొని ఆయనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టిడిపి ఆధ్వర్యాన ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలను అక్టోబర్ 3 వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
- దోపిడీ పాలన నుంచి ప్రజలను మరల్చడానికే అరెస్టులు : బాలకృష్ణ
రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ పాలనపై వస్తోన్న వ్యతిరేకత నుండి ప్రజల దృష్టిని మరలించేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి... చంద్రబాబును అరెస్టు చేయించారని హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి నాయకులు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. శనివారం నంద్యాలలో జరిగిన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో పాల్గనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సైబర్ గ్రిడ్‌లో రూ.రెండు వేల కోట్లు అవినీతి జరిగిందన్న ఆరోపణతో నారా లోకేష్‌ను అరెస్టు చేయాలని చూస్తున్నారన్నారు. ఇవన్నీ కక్షసాధింపులో భాగమేనని విమర్శించారు.










