Sep 19,2020 06:52

మన దేశంలో గత కొంత కాలంగా 'అమర వీరుల త్యాగాల' గురించి, 'దేశభక్తి' గురించి, 'సమర్ధత' గురించి మాట్లాడే హక్కును గుత్తకు తీసుకున్న బిజెపి కోవిడ్‌-19 విషయంలో మాత్రం 'ఇదంతా దైవలీల' అంటూ మెట్ట వేదాంతం కబుర్లు చెప్తోంది. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు డాక్టర్లను, పారా మెడికల్‌ సిబ్బందిని, పారిశుధ్య సిబ్బందిని ప్రశంసిస్తూ వారంతా కరోనాపై యుద్ధంలో సైనికులని ప్రధాని ప్రకటించారు. కాని ఆరు నెలల తర్వాత పార్లమెంటులో కరోనాపై చర్చ జరిగే సమయానికి ఆ వైద్య సిబ్బంది సంగతే మరిచిపోయారు. ఎంతమంది వైద్యులు కరోనాపై యుద్ధంలో పోరాడుతూ మరణించారో తమకు తెలియదని వైద్య, ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్‌ దూబే పార్లమెంటు లోనే ప్రకటించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ దీనిపై ఘాటుగా స్పందిస్తూ 'కరోనాపై యుద్ధంలో మరణించిన వైద్యులు అమరవీరులు కాదా? వారిని గుర్తు పెట్టుకోనవసరం లేదా?' అని సూటిగా ప్రశ్నించింది.
కార్గిల్‌ యుద్ధంలో, మరణించిన జవాన్ల మృతదేహాలను ప్రదర్శించి, వారి కుటుంబాలను పరామర్శించి వారి త్యాగాలను కొనియాడి ఆనక ఆ ప్రచారాన్నంతా ఎన్నికలలో బిజెపి ఏ విధంగా ఓటుగా మార్చుకుందో చూశాం. గత ఎన్నికల ముందు పుల్వామాలో సరిహద్దు భద్రతా దళాలపై జరిగిన దాడిలో మరణించిన వారి విషయంలోనూ అదే తంతు చూశాం. తాజాగా ఈ కరోనా సమయంలో కూడా ఇండో-చైనా సరిహద్దుల్లో ఘర్షణలో మరణించిన సైనికుల విషయంలోనూ అదే పునరావృతం అయింది. మరి దేశం మొత్తం కరోనా దాడితో విలవిలలాడుతూంటే ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను బలిపెట్టి అమరులైన వందలాది డాక్టర్ల విషయంలో అటువంటి స్పందన ఈ బిజెపి ప్రభుత్వం నుంచి ఎందుకు లేదు? మరణించిన వైద్యుల కుటుంబాల పరామర్శ మాట అటుంచి, కనీసం ఎంతమంది వైద్యులు ఈ 'యుద్ధం'లో మరణించారో ఆ సంఖ్య కూడా తమ వద్ద లేదని స్వయానా ఒక కేంద్ర మంత్రి ప్రకటించడం ఎంత బాధ్యతారాహిత్యం!
లాక్‌డౌన్‌ ప్రకటించేసి అంతటితో తమ బాధ్యత తీరిపోయిందన్నట్టు కేంద్రం వ్యవహరించింది. రాష్ట్రాలు కరోనాను అదుపు చేయడానికి సతమతమౌతూంటే చిన్నపాటి సహాయం కూడా చేయకపోగా పి.ఎం. కేర్స్‌ పేర లెక్కలు చెప్పనవసరంలేని విధంగా డబ్బు దండుకున్నారు. ప్రపంచంలోనే రోజువారీ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశంగా ఉన్నా, కనీసమైన నిజాయితీని కూడా కేంద్రం ప్రదర్శించడం లేదు. రికవరీ రేటు మన దేశంలో ఎక్కువ అని, మరణాల రేటు కనిష్టం అని చెప్పి తమ వైఫల్యాలను కప్పెట్టుకోజూస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టగలిగితే అప్పుడు అదంతా తమ కృషి ఫలితం అని చెప్పుకున్నా అర్ధం చేసుకోవచ్చు. కాని కరోనా బారిన పడినా ప్రజలు చావకుండా బతికి ఉండడం తమ ఘనతే అన్నట్టుంది ప్రభుత్వ వైఖరి. వైఫల్యాల బాధ్యతను మాత్రం రాష్ట్రాల మీదకు నెట్టేస్తున్నారు.
కరోనా రోగులకు వైద్యం చేయడం అంటేనే తమ ప్రాణాలను పణంగా పెట్టడం అని తెలిసే డాక్టర్లు, పారా మెడికల్‌, పారిశుధ్య సిబ్బంది వేలాదిగా రంగంలోకి దిగారు. లక్షలమంది ప్రాణాలను కాపాడారు. కాని మొదటి నుంచీ వారు తమకు తగినంత విశ్రాంతి సమయం ఉండాలని, అందుకోసం ఎక్కువమంది సిబ్బందిని రంగంలోకి దించాలని కోరుతున్నారు. విశ్రాంతి లేకుండా పని చేస్తే కరోనాను తట్టుకునే శక్తిని కోల్పోతారు. ఇప్పుడు మరణించిన వైద్యులలో అలా విశ్రాంతి లేకుండా పోయినందున మరణించిన వారే అత్యధికం. ఇకముందైనా వైద్య సిబ్బందికి తగినంత రక్షణ, విశ్రాంతి ఏవిధంగా కల్పించాలి అన్నదానిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కాని ఎంత కరోనా ముప్పు దాపురించినా, ఎందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా, ఎన్ని కోట్ల మంది ఉపాధి, తిండి లేక అల్లల్లాడుతున్నా, తాము మాత్రం కార్పొరేట్ల సేవలో, అమెరికా భజనలో మునిగి తేలుతూనే వుంటామని, ఎవరైనా ప్రశ్నిస్తే వారి గొంతులను నొక్కివేస్తామని ఆచరణలో మోడీ ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది. ఇక తేల్చుకోవాల్సింది జనమే.