Jul 10,2021 21:26

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో మహిళ పోలీసు స్టేషన్లు, కోర్టులు రానున్నాయని రాష్ట్ర డీజీపీ సవాంగ్‌ తెలిపారు. మహిళల రక్షణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని అన్నారు. విశాఖలోని ఆర్‌కె బీచ్‌లోగల ఎయు కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉత్తరాంధ్ర మహిళామిత్రల సమావేశంలో ఆయన పాల్గని దిశ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతిక ద్వారా మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా తీసుకుందన్నారు. గ్రామాల స్థాయికి దిశా గురించి అవగాహన కల్పించాలని ఆకాంక్షించారు. సైబర్‌ మిత్రా యాప్‌ని ప్రభుత్వం వచ్చిన వెంటనే లాంచ్‌ చేయడం జరిగిందన్నారు. ఈ యాప్‌కు అందే ఏ ఫిర్యాదుపైనైనా తక్షణమే పోలీసుల స్పందన ఉంటుందని తెలిపారు. మహిళా మిత్రగా ఎవరైనా తమ పేరును నమోదు చేసుకోవచ్చనన్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళా మిత్ర కమిటీ ఏర్పాటు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులకు సూచించారు. మహిళా మిత్ర అంటే వారు ఉద్యోగులు కారని, గ్రామ సేవకులే అని స్పష్టం చేశారు. గతంలో పోలీసు స్టేషన్లులో కాస్త నిర్లక్ష్యంగా ఉండేవని, దిశ యాప్‌ వచ్చాక మహిళకు పూర్తి భద్రత, ధైర్యం వచ్చినట్టే అన్నారు. ప్రతి గ్రామంలో, వార్డులో మహిళా పోలీసులు ఉంటారని, పోలీసులకుండే అధికారాలన్నీ సచివాలయ పోలీసులకు ఉంటాయని తెలిపారు. గడిచిన ఇరవై నెలల్లో 31,100 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపి మనీష్‌ కుమార్‌ సిన్హా, దిశ డిఐజి రాజకుమారి, ఎసిపిలు, డిసిపిలు పాల్గొన్నారు.