Sep 26,2022 23:19

ప్రజాశక్తి-విజయవాడ: నవరాత్రుల ప్రారంభమైన తొలి రోజే పారిశుధ్య డైలీ కార్మికులకు సదరు కాంట్రాక్టర్లు, ప్రజారోగ్య విభాగం అధికారులు చుక్కలు చూపించారు. అన్నపానియాలు లేక కార్మికులు, వారితో వచ్చిన పిల్లలు, వృద్ధులు అల్లాడిపోయారు. రోజంతా పని చేసి స్నానం చేసే వసతి కానీ, నింద్రించడానికి తగిన సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందుస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా సోమవారం ఉదయం పనిలోకి దిగిన తరువాత అతి తక్కువ కూలి ఇస్తానన్న కాంట్రాక్టర్ల వైఖరికి నిరసనగా అనేక మంది కార్మికులు వారి గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. ఉన్న కొద్దిమంది కార్మికులు తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ సిఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ధర్నాకు దిగి పెద్దఎత్తున ఆందోళన చేశారు.
నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా కొండ పరిసర ప్రాంతాలు, ప్లైఓవర్‌ పరిధిలోని ఘాట్స్‌, ఆర్టీసి బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పని కోసం నగరపాలక సంస్థ వెయ్యి మంది డైలీవేజ్‌ కార్మికులను సదరు కాంట్రాక్ట్‌ర్‌ ద్వారా పనిలో పెట్టుకుంది. 13 రోజుల పాటు పారిశుధ్య పని చేయించడానికి సుమారు రూ.55 లక్షలకు పైగా నిధులు కేటాయించింది. ప్రతి కార్మికుడికి షిప్ట్‌కు (8 గంటలు) పురుషునికి రూ.700, మహిళకు రూ.500 చొప్పున కూలి, భోజనం, వసతి కల్పించేటట్లుగా విఎంసికి సదరు కాంట్రాక్ట్‌ర్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. తీరా కార్మికులు పనిలోకి దిగిన తరువాత షిప్ట్‌కు రూ.250 నుంచి 300లోపే ఇస్తామని, రోజంతా (రెండు షిప్ట్‌లు) శానిటేషన్‌ పని చేస్తే రూ.500 ఇస్తామని, భోజనం, టిఫిన్‌ లేదని, ఇష్టమైతే చేయండి లేకపోతే లేదన్నట్లుగా కాంట్రాక్టర్లు చెప్పడంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణవేణి ఘాట్‌ ప్లైఓవర్‌ వద్ద ఎవరో పిండ ప్రదానం కోసం తీసుకొచ్చిన అన్నంపెడితే ఆకలేసి తిన్నామని, విఎంసి కార్యాలయంలోని బాత్‌ రూమ్‌ల్లో స్నానం చేసిన నీటినే తాగి దప్పిక తీర్చుకున్నామని సూర్యాపేట జిల్లా అనంతగిరి, త్రిపురారం గ్రామాల నుంచి వచ్చిన రాంబాబు, కొమిడి రామిరెడ్డి, ఇతర పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకుడి గుడి ఏరియా సత్రాల్లో ఎవరో భోజనం పెడితే అదే పొట్ట నింపుకున్నామని బాపట్ల జిల్లాకు చెందిన పలువురు వృద్ద కార్మికులు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.
న్యాయం చేయాలని సిఐటియు ధర్నా
కార్మికులను మోసం చేస్తున్న సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు కార్మికులకు తగిన న్యాయం చేయాలని సిఐటియు నాయకులు విఎంసి ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులకు జరుగుతున్న మోసాన్ని తెలుసుకున్న సిఐటియు జిల్లా నాయకులు టి ప్రవీణ్‌, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు స్టీఫెన్‌బాబు మాట్లాడుతున్న ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి కార్మికుడికి షిప్ట్‌కు రూ.700 ఇవ్వడంతో పాటు భోజనం, టిఫిన్‌, విశ్రాంతి తీసుకునేందుకు సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను మోసం చేసిన కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని, స్వయంగా ప్రజారోగ్య విభాగం అధికారులే కార్మికులను పనిలోకి పెట్టుకొని స్వయంగా విఎంసినే కార్మికులకు కూలి ఇచ్చేటట్లుగా చూడాలని వారు డిమాండ్‌ చేశారు.