Jan 18,2022 08:15
  • రూ.18కు తగ్గుదల శ్రీ పెట్టుబడి ఖర్చు కూడా రాదని రైతు ఆవేదన

ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి : నిన్న మొన్నటివరకు కిలో వంద రూపాయల వరకు పలికిన టమోటా ధర దిగొస్తోంది. ప్రస్తుతం రూ.18 నుంచి రూ.24 మధ్య తొణికిసలాడుతోంది. పంట ఇప్పుడిప్పుడే చేతికి వస్తుండటమే దీనికి కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టమోటా వినియోగదారులకు కొంత ఊరట కలగనుంది. ఇదే సందర్భంలో పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 62,500 ఎకరాల్లో టమోటా సాగైంది. నాసిరకం విత్తనాల వల్ల ఎక్కువగా పంట దెబ్బతింది. మిగతా పంట గత నెలలో వర్షానికి పాడైపోయింది. దీంతో నెలన్నరోజుల క్రితం ఎన్నడూ లేని విధంగా టమోటా ధరలు రికార్డుస్థాయిలో పెరిగాయి. అత్యధికంగా నవంబర్‌ 23న మదనపల్లి మార్కెట్‌లో రూ.130 ధర పలికింది. ప్రస్తుతం క్రమంగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. టమోటా దేశవ్యాప్తంగా మదనపల్లి మార్కెట్‌ నుంచే ఎక్కువగా ఎగుమతి అవుతుంటుంది. మన రాష్ట్రంలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టమోటా ఎక్కువగా పండిస్తారు. సంక్రాంతి సీజన్‌లో తమిళనాడులో టమోటా ఎక్కువగా వినియోగిస్తారు. అక్కడికి చిత్తూరు జిల్లా నుంచే ఎగుమతి అయ్యేది. ఈసారి పరిస్థితి మారిపోయింది. అక్కడి అవసరాలకు స్థానికంగా వచ్చే పంటే సరిపోతోంది. అలాగే తమిళనాడుకు స్థానికంగానే సరుకు నేరుగా వెళ్లిపోతుండటంతో చిత్తూరు జిల్లా టమోటాకు డిమాండు తగ్గింది. దీంతో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న రోజుల్లో స్థానికంగా ఉన్న పంట చేతికొస్తే ధరలు మరింత తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టామని, ధర పతనమవుతుండటంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.