Oct 22,2023 00:06

తిరుపతి అభివృద్ధికి అడ్డంగా మారిన బిజెపి తీరును వ్యతిరేకించండి!


తిరుపతి అభివృద్ధికి అడ్డంగా మారిన
బిజెపి తీరును వ్యతిరేకించండి!
వామపక్షాల నేతలు పిలుపు
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి అభివృద్ధి కోసం సంవత్సరానికి ఒక శాతం నిధుల కేటాయించాలని టీటీడీ పాలకమండలి చేసిన నిర్ణయం మనకందరికీ విధితమే. ఈనిధులు కేటాయింపుపై బిజెపి అడుగడుగునా అడ్డుకుంటుందని, బిజెపి తీరును తిరుపతి ప్రజలు వ్యతిరేకించాలని శనివారం యశోదనగర్‌లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మాట్లాడుతూ తిరుపతి అభివద్ధికి టీటీడీ నిధులు కేటాయించడం సరైందికాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమన్నారు. బిజెపి ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వంలోనై ఈ నిర్ణయం చేసిందని విమర్శించారు. విభజన హామీలను అమలు చేయకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, వెనుకబడిన ప్రాంతాలకి ప్యాకేజీలు ప్రకటించకుండా రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేసిందని విమర్శించారు. అభివృద్ధి నిరోధకులుగా బిజెపి వైఖరి స్పష్టంగా కనపడుతుందన్నారు. తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవాలని పదేపదే బిజెపి కుట్రలకు పాల్పడుతుందని, ఈ కుట్రలను తిరుపతి ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి వైఖరిని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు వ్యతిరేకించాలన్నారు. తిరుపతి అభివృద్ధి కోసం టీటీడీ నిధులు కేటాయించే వరకు వివిధ ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కందారపు మురళి, నగర కార్యదర్శి టీ.సుబ్రహ్మణ్యం, నాయకులు వేణు, మునిరాజా, రాధాకృష్ణ, తంజావూరు మురళి, అక్బర్‌, రవి, సిపిఐ నాయకులు రాధాకృష్ణ, రవి, శ్రీరాములు, రాజా పాల్గొన్నారు.