Sep 13,2022 23:13

  •  జిల్లా విస్తృత సమావేశంలో వక్తలు
  • ఎంపి కేశినేని నాని గైర్హాజరు

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌
గురునానక్‌నగర్‌లోని ఎన్‌ఎసి కళ్యాణమండపంలో ఉమ్మడి కృష్ణాజిల్లా టిడిపి విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరిగింది. తొలుత టిడిపి జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభా ప్రాంగణంలో ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశానికి ఎన్‌టిఆర్‌, కృష్ణాజిల్లా పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షులు నెట్టెం రఘురాం, కొనకళ్ల నారాయణరావు అధ్యక్షత వహించారు. తొలుత ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ దౌర్జన్యమే ప్రాతిపదికగా, నియంతృత్వమే ప్రాతిపదికగా జగన్‌ పాలన సాగిస్తున్నారన్నారు. టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. నేడు కోర్టులు ఉన్నాయి కాబట్టి జగన్‌ నిరంకుశ పాలన నుండి రక్షణ ఉందన్నారు. కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టిడిపి ఆవిర్భవించిందన్నారు. చంద్రబాబు దయతో రాజకీయంలోకి వచ్చిన కొడాలి నాని నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు విజయవాడలో రౌడీయిజాన్ని అణచివేసి ప్రజలందరూ సుఖంగా ఉండే వాతావరణం కల్పించారన్నారు. జగన్మోహన్‌రెడ్డి వచ్చిన తరువాత విజయవాడ నగరంలో రౌడీయిజాన్ని తయారు చేస్తున్నారని తెలిపారు. ప్రజావేదికను కూలకొట్టారన్నారు. ఏ రాష్ట్ర పార్టీ కార్యాలయంపైనా చరిత్రలో ఎక్కడా దాడి జరగలేదన్నారు. కొంత మంది గూండాలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేసి మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమావేశంలో శాసన సభ్యులు గద్దె రామమోహన్‌, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్‌, బచ్చుల అర్జునుడు, కాగిత కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని నాని సమావేశానికి గైర్హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే టిడిపి నాయకులు బుద్దా వెంకన్న మధ్యలోనే వెళ్లిపోయారు. విశాఖలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని అందుకే వెళుతున్నట్లు మీడియాకు తెలిపారు.