Jul 10,2021 15:02

హుజూరాబాద్‌ : హుజూరాబాద్‌ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి రాజుకుంది. దుబ్బాక ఫలితాలు రిపీట్‌ కాకుండా ఈ ఎన్నికలో గెలవడం ద్వారా తమకు తిరుగులేదనే సంకేతాలను ప్రజల్లోకి పంపించాలని అధికార టిఆర్‌ఎస్‌ భావిస్తుండగా.. సొంత నియోజకవర్గంలో గెలిచి టిఆర్‌ఎస్‌కు షాకివ్వాలని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్‌ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా రేవంత్‌ నేతృత్వంలో తనదైన ముద్ర వేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఈటల రాజేందర్‌ సంచలన ఆరోపణలు చేశారు. హుజూరాబాద్‌ ప్రజలను టిఆర్‌ఎస్‌ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని, ఇతర ప్రాంతాల ఓటర్లను ఇక్కడి ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని, దొంగ ఓట్లను సృష్టిస్తున్నారని అన్నారు. ఒక్కో ఇంట్లో 30 నుంచి 40 దొంగ ఓట్లను కూడా నమోదు చేస్తున్నారని విమర్శించారు. టిఆర్‌ఎస్‌ చేస్తున్న చట్ట విరుద్ధమైన పనులకు సహకరిస్తున్న అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. హుజూరాబాద్‌, జమ్మికుంటలో దొంగ ఓట్లపై ప్రజలు నిఘా పెట్టాలని, ఎవరి ఓటును వారు కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. అధికారులు అధికార పార్టీకి బానిసల్లా పనిచేయవద్దని ఆయన హితవు పలికారు.