'ఒక భాష యొక్క సాహిత్యాన్ని పునరుజ్జీవింప చేయలంటే అది ఒకరికి సాధ్యం అయ్యేది కాదు. అందులోనూ విదేశీయునికైతే మరింత కష్టం' అని సి.పి.బ్రౌన్ అన్నాడే కాని ముప్పై సంవత్సరాల్లో ఆ కొండంత పనినీ చేసి చూపాడా పరదేశీయుడు.
సి.పి. బ్రౌన్ ఆంధ్ర ప్రాంతంలో అసిస్టెంట్ కలెక్టరుగా, జిల్లా జడ్జిగా, జిల్లా కలెక్టర్‌గా పని చేసింది ముచ్చటగా ముప్పై ఏళ్లే అయినా, సాధించింది మాత్రం కొండంత! ఆయన కడపలో (1826-27) కొన్న బంగళా తోట బ్రౌన్ కాలేజీగా ప్రసిద్ధి చెందింది కాని వాస్తవానికి అది తెలుగు విశ్వవిద్యాలయమే !
అక్షర జ్ఞానం లేని తెలుగు వారికెందరికో అక్షర భిక్ష పెట్టాడు సి.పి.బ్రౌన్. ఆ దరిద్ర నారాయణులకు 'ధర్మ బళ్ల' ద్వారా తెలుగు, పార్శీ భాషలతో పాటు ఇంగ్లీషు కూడా నేర్చుకొనే సౌకర్యం కల్పించాడు. పైగా ఇంగ్లీషు దొరలకు తెలుగు నేర్చుకొనేందుకు వీలుగా తెలుగు రీడర్లు, ఇంగ్లీషు తెలుగు నిఘంటువు సమకూర్చాడు. మన తెలుగు వాళ్లకు ఇంగ్లీషు పట్ల ఆసక్తి, అభిరుచి కల్గించి...తెలుగు భాష, సాహిత్యం పట్ల అభినివేశం చేకూరేలా చేశాడు. తాటాకుల్లో, కాగితాల కట్టల్లో మగ్గిపోతున్న తెలుగు కావ్యాలను ఎన్నింటినో చీకటి కొట్లలో నుంచి వెలికి తెచ్చాడు. మౌఖిక ప్రచారంలో వున్న వేమన పద్యాలను వేర్వేరు ప్రాంతాల నుంచి సేకరించి, 693 పద్యాలకు అనువాదం సమకూర్చి 1829లో ప్రచురించాడు. మను చరిత్ర, వసు చరిత్రలను పరిష్కరింప చేసి సులభమైన వ్యావహారిక తెలుగు భాషలో వ్యాఖ్యానుసహితంగా ప్రచురింపచేశాడు. ఆయన సుమారు 98 ప్రబంధాలను సేకరించినట్లు తెలుస్తుంది. ప్రజా జీవితానికి దగ్గరైన కావ్యాల పట్ల బ్రౌన్‌కు మక్కువ ఎక్కువ. ఆయన సుమారు 84 శతకాలను సేకరించి, పరిష్కారం అయ్యేలా చూశాడు. ఎన్నో తెలుగు కావ్యాల్ని పరిష్కరింపచేసి, ఆంగ్లంలో పీఠకలు రాసి ప్రచురించాడు. కొన్ని కావ్యాల ఇతివృత్తం, కవి కాల పరిస్థితుల గురించి సుదీర్ఘ భూమికను రచించాడు. తెలుగు కవుల్ని, కావ్యాల్ని ప్రాచీన ఆంగ్ల, గ్రీకు, లాటిన్ కవులతో, కావ్యాలతో పోల్చి చూశాడు. ఈ విధంగా 170 ఏళ్ల కిందటే తులనాత్మక విమర్శకు నాందీ వాక్యాలు పలికాడు. అముద్రితంగా వున్న బ్రౌన్ విమర్శనాత్మక రచనలను ప్రచురిస్తే, ఆయన అక్షర సామాజ్య్ర వైశాల్యం మనకు అవగతం అవుతుంది.
ప్రాచీన తెలుగు కావ్యాల్ని అర్థం చేసుకోవాలంటే మనం బ్రౌన్ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువును ఆశ్రయించాల్సిందే. బ్రౌన్ సేకరించి, భద్రపరిచిన జాబుల సంపుటాలు ఆనాటి తెలుగుదేశ సాంఘిక, రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులకు అద్దం పడతాయి. తెలుగు వచనం తీరుతెన్నులకు దారిదీపాలవుతాయి.
సి.పి.బ్రౌన్ మనకు మిగిల్చిపోయిన 'అక్షర సామ్రాజ్యం' ఎంతో విశాలమైనది. ఆ అక్షర సామ్రాజ్యం లోని రాజ్యాల్ని, నాడుల్ని, నుడుల్ని లోతుగా అధ్యయనం చేసే బరువు బాధ్యతల్ని పరిశోధకులకు అప్పగించాలి. ఈ మహత్కార్యానికి కడప లోని సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం కంకణం కట్టుకొంటుందని ఆశిద్దాం.
- ఘట్టమరాజు,
సెల్ : 9964082076










