తెలుగు సాహిత్యానికి వన్నెతెచ్చిన బోయి భీమన్న బరం పార్కులో జరిగిన జయంతి వేడుకల్లో మంత్రి రోజా
ప్రజాశక్తి - భవానీపురం : తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన మహానీయుడు డాక్టర్ బోయి భీమన్న అని రాష్ట్ర పర్యాటక సాంస్కతిక, యువజన అభివద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహాకవి పద్మభూషణ్ బోయి భీమన్న 112వ జయంతి ఉత్సవాలు ఎపి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భవానీపురం బరంపార్కులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కతిక, యువజన అభివద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా, పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు, తొలుతగా బోయి భీమన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన బోయి భీమన్న తన రచనలు, కావ్యాల ద్వారా పద్మభూషన్ స్థాయికి గుర్తింపు పొందారంటేనే ఆయన ఎంత గొప్ప కవో, రచయితో మనం అర్థం చేసుకోవచ్చన్నారు. తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన మహానీయుడు డాక్టర్ బోయి భీమన్న. ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు 70 ఏళ్ల పాటు ఆయన నాటకాలు, కావ్యాలు, రచనలు చేయడం నిజంగా హ్యాట్సాఫ్ అని కొనియాడారు. 1975లోనే ఆయన రాసిన గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవితా సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కిందన్నారు. ఆయన స్ఫూర్తితో రాబోయే తరాల్లో ఇంకా కొత్త రచయితలు ముందుకు రావాలని, అవార్డులు పొందాలన్నారు. సమాజాన్ని చైతన్య పరచాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ బోయి భీమన్న జయంతిని పురస్కరించుకొని భీమన్న స్మారక పురస్కారాన్ని 2022 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత అయిన డా. కత్తిమండ ప్రతాప్ కుమార్ 2023 సంవత్సరానికి గాను తెలుగు శాఖాధిపతి, మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నె, ఆచార్య డా.విస్తరి శంకరరావును సత్కరించుకొని, వారిరువురికి రెండు లక్షల నగదు పురస్కారాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన యువజనాభ్యుదయ, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి ఆర్.కే. రోజా అందజేశారు. ఈ కార్యక్రమంలో బోయి భీమన్న సతీమణి బోయి హైమావతిని మంత్రి రోజా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ శాసన సభ్యులు మల్లాది విష్ణు , రాష్ట్ర సాంస్కతిక చైర్మన్ వంగపండు ఉషా, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ లక్ష్మీ, తెలుగు భాష సంఘం అధ్యక్షులు విజయ బాబు, డైరెక్టర్ మస్తానమ్మ, రాష్ట్ర సంస్కతిక శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ఇతర అధికారులు పాల్గొన్నారు.










