Feb 27,2023 21:39

ఫొటో : మాట్లాడుతున్న టైలర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

టైలర్స్‌ డేను విజయవంతం చేయండి
ప్రజాశక్తి-కావలి : కావలిలో టైలర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో భాగంగా టైలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించే ''టైలర్స్‌ డే''ను ప్రతిఒక్క టైలర్‌ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టైలర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం రైల్వే స్టేషన్‌ రోడ్డులోని జర్నలిస్ట్‌ క్లబ్‌లో కమిటీ ప్రతినిధులు గౌరవ అధ్యక్షులు పి.పెంచలయ్య ప్రెసిడెంట్‌ రమేష్‌, సెక్రటరీ రహీమాన్‌, ట్రెజరర్‌ వేణు, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రెడీమేడ్‌ రంగం ప్రవేశంతో టైలర్ల రంగం తీవ్రంగా దెబ్బతిందన్నారు. ఈ రంగాన్ని బతికించుకొనేందుకు ప్రభుత్వం ఆదుకొనే చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా ప్రతి టైలర్‌ కుటుంబానికి ఆర్థికంగా రుణ సదుపాయం కల్పించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే టైలర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, ఇందులో కొంత బడ్జెట్‌ కేటాయించి ఆదుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. యూనియన్‌ సభ్యుల ఐకమత్యంతో గత29 పర్యాయాలు ''టైలర్స్‌ డే''ను పురస్కరించుకొని వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు.
అలాగే ఈ ఏడాది 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ విచ్చేసి, తమ సమస్యలను ప్రస్తావించుకొని అందుకు తగిన పరిష్కార మార్గం కనుగొనాలని భావించి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం అర్‌.టి.సి. బస్టాండ్‌ ఎదురుగా మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద నుండి బయల్దేరి ఒంగోలు బస్టాండ్సెంటర్‌లోని ఎ.వి.ఎస్‌ కళ్యాణ మంటపం వరకు బారీ ఉరేగింపుగా వెళ్లి మండపంలో సభ నిర్వహిస్తామన్నారు. భవిష్యత్‌లో ఎలా ముందుకు వెళ్లాలనేది సమిష్టిగా నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌ రావు, ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు మాగుంట పార్వతమ్మ, కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, బిజెపి నాయకులు పసుపులేటి సుధాకర్‌, జనసేనకి చెందిన ఆళహరి సుధాకర్‌, అధికారులు, వివిధ పార్టీ నాయకులు టైలర్లు, శ్రేయోభిలాషులు పాల్గొంటారని తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనాథ్‌, అల్తాఫ్‌, మాల్యాద్రి, దుర్గ, శేషమ్మ పాల్గొన్నారు.