May 25,2022 08:17
  • చిదంబరం నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ
  • పిఎజిలో జి-23 నేతలకు అవకాశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో - దేశ రాజకీయాల్లో పట్టు నిలుపుకొని 2024 సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. సంస్థాగత మార్పులపై ప్రధాన దృష్టి సారించి రాజస్థాన్‌లోని ఉదరుపుర్‌ వేదికగా ఇటీవల 'నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌'ను నిర్వహించిన ఆ పార్టీ మంగళవారం నాడు మూడు కీలక కమిటీలను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసే వ్యూహాలు రూపొందించేందుకు టాస్క్‌ఫోర్స్‌-2024 పేరిట ప్రత్యేక కమిటీని నియమించారు. మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కాంగ్రెస్‌ యువ నాయిక ప్రియాంక గాంధీ వాద్రాకు ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
    పార్టీ వ్యూహా రచనలో కీలకమైన రాజకీయ వ్యవహారాల బృందం (పిఎజి)లో పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌, సభాపక్ష ఉపనేత ఆనంద్‌ శర్మ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అజాద్‌, ఆనంద్‌ శర్మ ఇరువురు కూడా పార్టీ సంస్థాగత మార్పుల కోసం డిమాండ్‌ చేసిన అసమ్మతి నేతల బృందం (గ్రూప్‌-23)లో సభ్యులుగా ఉన్నవారే కావడం విశేషం. పార్టీలో సమిష్టి నిర్ణయాలు రూపొందించేందుకు కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డును పునరుద్ధరించాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. పిఎజిలో వీరికి చోటు ఇవ్వడం ద్వారా వారి డిమాండ్‌ను పాక్షికంగా నెరవేర్చినట్లుగా భావిస్తున్నారు. అయితే ఈ నెల 15న కొత్త కమిటీ (పిఎజి) ఎలా ఉండనుందో వివరిస్తూ ..కొత్త బృందం సమిష్టి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని, విస్తారమైన అనుభవం కలిగిన సీనియర్‌ సహచరుల నుంచి తనకు సహాయ, సహకారాలు అందుతాయని సోనియా గాంధీ పేర్కొన్నారు. గాంధీ కుటుంబ విధేయులుగా పేరొందిన మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, దిగ్విజరు సింగ్‌, కెసి వేణుగోపాల్‌, జితేంద్ర సింగ్‌ కూడా పిఎజిలో సభ్యులుగా చోటు దక్కించుకున్నారు.
టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో చిదంబరం, ప్రియాంకతో పాటు పార్టీ వ్యూహాకర్త జైరాం రమేశ్‌, ముకుల్‌ వాస్నిక్‌, అజరు మాకెన్‌, రణదీప్‌ సూర్జేవాలా, సునీల్‌ కనుగోలు ఉన్నారు. కనుగోలు ఎన్నికల వ్యూహాకర్త అయిన ప్రశాంత్‌ కిశోర్‌కు గతంలో సహాయకునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వ్యూహాలు రచిస్తున్నారు.
 

                                                        9 మందితో భారత్‌ జోడో యాత్ర కమిటీ

కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకూ చేపట్టాలని నిర్ణయించిన 'భారత్‌ జోడో యాత్ర' విజయవంతంగా నిర్వహించేందుకు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్‌ నేతృత్వంలో తొమ్మిది మందితో కేంద్ర ప్రణాళిక కమిటీని కూడా సోనియా గాంధీ ప్రకటించారు. ఈ యాత్ర వచ్చే అక్టోబరు 2న కన్యాకుమారిలో ప్రారంభించనున్నారు. 12 రాష్ట్రాల గూండా మొత్తం 3500 కిమీ మేర ఈ యాత్ర నిర్వహించేవీలుంది.

 

01