- ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ ఎస్ కోటేశ్వరరావు
ప్రజాశక్తి-కలెక్టరేట్ : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజల ఆస్తి, దీనిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మే అధికారం మోడీ ప్రభుత్వానికి లేదని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎస్ కోటేశ్వరరావు అన్నారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 112వ రోజుకు చేరాయి. ఈరోజు దీక్షలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ అనేకమంది త్యాగాలతో, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఏర్పడిందన్నారు. లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ ను అమ్మటం సరికాదన్నారు. సుమారు 40 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి అందిస్తున్న స్టీల్ ప్లాంట్, ప్రైవేట్ పరం అయితే వారందరికీ ఉపాధి లేకుండా పోతుందని, పైగా ప్రైవేటు కార్పోరేట్ సంస్థల దోపిడీకి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని ఆరోపించారు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ ల కంటే, నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి చేయడమే కాకుండా, వాటన్నింటి కంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తోందని పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కొద్ది రోజుల క్రితం ప్రకటించారని చెప్పారు. అటువంటప్పుడు ప్రైవేటీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రైవేటు స్టీల్ ప్లాంట్ లు అన్నింటికీ సొంత గనులు ఇచ్చారని, అటువంటప్పుడు ప్రభుత్వ రంగంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు విశాఖపట్నంకు చెందినది మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికీ చెందినది అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం, త్యాగాలు దీనితో ముడిపడి ఉన్నాయన్నారు. దీనిని విస్మరించి ప్రైవేటీకరణ చేస్తే, కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి అప్పారావు, రాంప్రభు, వై అప్పారావు, వి తులసీరావు, డి ప్రజ్ఞానంద్ తదితరులు పాల్గొన్నారు.










