ప్రజాశక్తి-పెనుమూరు : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాలపురం గ్రామంలో భవ్యశ్రీ విద్యార్థిని మృతి కేసుపై సమగ్ర విచారణ చేయాలని చిత్తూరు జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ బి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ బృందం ఆ గ్రామానికి వెళ్లి భవ్యశ్రీ కుటుంబాన్ని వారి తల్లిదండ్రులను పరామర్శించారు. వారి తల్లిదండ్రుల కోరిక మేరకు అమ్మాయి మృతి కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇవన్నీ పటా పంచలు కావాలంటే ఏది నిజం ఏది అబద్దమో సరైన ఆధారాలతో తేల్చడానికి సమగ్ర విచారణ చేపట్టి నిజమైన నిందితులను పట్టుకోవాల్సిన బాధ్యత ఈ వ్యవస్థ పై ఉన్నదని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కేసులు పునరావృత్తం కాకుండా చూడాలని ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెనుమూరు మండలంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అనేక మిస్సింగ్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఈ మండలంలో మహిళలకు విద్యార్థినిలకు రక్షణ లేని పరిస్థితి వస్తుందని, కావున జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ చొరవ తీసుకొని భవ్యశ్రీ కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు సురేంద్ర, కృష్ణ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.










