Sep 29,2023 17:34

ప్రజాశక్తి-విశాఖ : విశాఖ ఉక్కు మనందరి హక్కు... అమ్మేవారు, కొనేవారు విశాఖ స్టీల్ ప్లాంట్లో అడుగుపెడితే ఖబడ్దార్ అంటూ ఉక్కు కార్మికులు తెగించి పోరాడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం తెలిపారు. విశాఖ ఉక్కు రక్షణకై సిపిఎం బైక్ యాత్ర కంచరపాలెం జోన్ లో కంచరపాలెం మెట్టుకు చేరుకుంది. ఈ బైక్ యాత్రకు రథసారథి కె లోకనాథం మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, లక్ష మంది ఉపాధి విశాఖ అభివృద్ధిపై దాడికి సిద్ధపడిందని ఆగ్రహించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్లాంట్ ను అమ్మేస్తాం లేదంటే మూసేస్తాం అని ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ ప్రజా ద్రోహ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ కార్మికులు ప్రజలు 955 రోజుల నుంచి పోరాడుతున్నారని తెలిపారు. ఈ ఉద్యమానికి రాష్ట్రంతో పాటు, దేశవ్యాప్తంగా మద్దతు లభించడం ఈ ఉద్యమ ప్రత్యేకత అని అన్నారు. అయినా మోడీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదన్నారు. సిపిఎం ఆది నుండి ఉద్యమంలో తన వంతు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఉద్యమానికి మరింత విశాల ప్రజా మద్దతు కూడగట్టేందుకు ఈనెల 20 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల బైక్ యాత్ర చేపట్టిందన్నారు. అక్టోబర్ 5వ తేదీన భారీ బహిరంగ సభ కూర్మాణపాల జంక్షన్లో జరుగుతుందన్నారు. దీనికి సిపిఎం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి హాజరుకానున్నారని తెలిపారు. ఈ బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి కేంద్రాలను బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇతర పరిశ్రమల్లా స్థాపించలేదు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో మహోద్యమం జరిగింది. 32 మంది బలిదానం, 62 గ్రామాల ప్రజలు, 16,500 మంది రైతులు 22 వేల ఎకరాల భూములు త్యాగం చేశారు. 52 మంది కమ్యూనిస్టు పార్టీ శాసన సభ్యులు,15 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు తృణప్రాయంగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. పలువురు ప్రముఖులతో పాటు వేలాదిమంది యువత, విద్యార్థులు ఉద్యమించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. పోలీస్ కేసుల అనుభవించారు. ప్లాంట్లో వివిధ ప్రమాదాల్లో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ త్యాగాలను భూస్థాపితం చేయడానికి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. విశాఖ మణిహారం ప్లాంట్ ను కాపాడుకోవాలి. నిర్వాసితులకు ఉపాధి సాధించాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధిని సాధించుకుందాం అనే నినాదంతో సిపిఎం పార్టీకి చేపట్టిన బైక్ యాత్ర ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అశేషమైన ఆదరణ చూపించారు. బిజెపి మెడల వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అని వక్తలు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.పద్మ, కంచరపాలెం జోన్ కార్యదర్శి బి.ఈశ్వరమ్మ జోన్ కమిటీ సభ్యులు అప్పారావు, ఎం ఈశ్వరరావు, ఎస్ శ్రావణ్, ఏ పుష్పాంజలి సాహూ, ఓ విజయ, కె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.