Jul 08,2021 13:40

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వేలంలో బిడ్లు ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన దుర్మార్గమైనదని, ఈ చర్యను నిరసిస్తూ ఎపిలోని వైసిపి, టిడిపి ఎంపిలు 25 మంది పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేసి స్టీల్‌ ప్లాంటును రక్షించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ అజశర్మ డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి బిడ్లు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడటంతో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు మండిపడ్డాయి. గురువారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రకరకాల చర్యలకు దిగుతోందని విమర్శించారు. అయితే కేంద్రం చర్యలను గట్టిగా ప్రతిఘటించడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేంద్రానికి లేఖలు రాయడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకు జరుగుతున్న ఉద్యమానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు.
సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ను కొనడానికి ఎవరు వచ్చినా అడ్డుకొని తీరుతాం అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ రావడానికి 32 మంది ప్రాణ త్యాగాలు చేశారని, వారి త్యాగాలను వృధా కానిచ్చేది లేదన్నారు. జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గండి నాయనబాబు మాట్లాడుతూ 3 నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు 7 మాసాలుగా ఉద్యమిస్తున్నారని, అలాగే విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం ఉద్యమాన్ని అదేస్థాయిలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షుడు ఆర్‌ కె ఎస్‌ వి కుమార్‌, పబ్లిక్‌ సెక్టార్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ ఎస్‌ జ్యోతీశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం మన్మధరావు, ఐఎఫ్‌ టియు జిల్లా అధ్యక్షుడు వై కొండయ్య, వార్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ ప్రకాశరావు, బి బి గణేష్‌, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె అప్పలనాయుడు, ఐద్వా నగర కార్యదర్శి డాక్టర్‌ జి ప్రియాంక, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి యుఎస్‌ఎన్‌ రాజు, ఎస్‌ఎఫ్‌ఐ నగర నాయకురాలు కె కుసుమ, కెవిపిఎస్‌ నగర కార్యదర్శి ఆర్‌ పి రాజు, వి కఅష్ణారావు తదితరులు పాల్గొన్నారు.