ఈనెల 14న కేంద్ర క్యాబినెట్ 'స్టార్స్' (స్ట్రెందెనింగ్ టీచింగ్-లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ బ్యాంకు మన దేశ పాఠశాల విద్యలో తీసుకురాదల్చుకున్న పాలనా పరమైన సంస్కరణలను అమలు చేస్తున్నది. ఇది ప్రపంచబ్యాంకు మూడవ విడత పాక్షిక రుణంతో అమలు కానున్న కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం. తొలుత ఇది పైలెట్ ప్రాజెక్టుగా హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లో అమలు కానుంది. 15 లక్షల పాఠశాలల్లో 25 కోట్ల మంది విద్యార్థులు, కోటి మంది ఉపాధ్యాయులను ఈ ప్రాజెక్టు ప్రభావితం చేస్తుంది. పూర్వ శిశు విద్య నుంచి 12వ గ్రేడ్ వరకూ ఇది అమలవుతుంది.
'స్టార్స్' ప్రాజెక్టులో ఏముంది?
ప్రస్తుతం పాఠశాల విద్య నిర్వహణ పద్ధతిని మార్చడం... జాతీయ స్థాయిలో సమాచార, అంచనా వ్యవస్థలను ఏర్పాటు చేయడం...అలాగే బోధన, అభ్యసన ఫలితాలను మదింప చేయడం...ముఖ్యంగా పూర్వ శిశు, వృత్తి విద్యల్లోనూ, పునాది అక్షరాస్యతా సంఖ్యా జ్ఞానం, ఉపాధ్యాయ శిక్షణ మొదలగు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలుగా పెట్టుకొంది. ఈ లక్ష్య సాధనకు ఈ ప్రాజెక్టులో పిఎఆర్‌ఎకెహెచ్ (పెర్‌ఫార్మాన్స్ అసెస్‌మెంట్, రివ్యూ అండ్ ఎనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్), సిఇఆర్‌సి (కంటింజెన్సీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాంపొనెంట్) భాగాలున్నాయి. అందులో ముఖ్యమైంది పిఎఆర్‌ఎకెహెచ్ ను ఏర్పరచడం. ఇది కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అజమాయిషీలో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా విద్యార్థుల అంచనా, మదింపు, మూల్యాంకనం చేయడానికి నిబంధనలను రూపొందిస్తుంది. రాష్ట్రాల స్కూల్ బోర్డులు వీటిని పాటించాలి. ఇది రాష్ట్ర, జాతీయ స్థాయిలో అభ్యసన ప్రమాణాల అమలును పరీక్షించే ప్రమాణాలను రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు మరో ముఖ్యమైన పని జాతీయ స్థాయిలో విద్యా మంత్రిత్వ శాఖ సమాచార వ్యవస్థను బలపర్చడం. విద్యార్థుల నిలుపుదల, పరివర్తన, పూర్తి చేయడం వంటి దేశవ్యాప్త సమాచారాన్ని సేకరిస్తారు. రాష్ట్ర స్థాయిలో పాఠశాల నుంచి ఫలితాలు రాబట్టడం లేబర్ మార్కెట్‌కు అవసరమైన నిపుణుల తయారీకి పాఠశాలల నుంచి వ్యూహాలను రూపొందించడం ముఖ్యమైన పనిగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ముఖ్యంగా పాఠశాలల పాలనా వ్యవహారాలు, యాజమాన్యం, మానిటరింగ్, ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాలల సేవల పంపిణీ, విద్యా సేవల పంపిణీ మొదలగు అంశాల్లో ప్రైవేటు రంగం జోక్యం చేసుకుంటుంది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగమైన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్, పూర్వ శిశువిద్య కోసం నేషనల్ కరికులమ్ ఫ్రం వర్క్ మీద దృష్టి పెట్టాలని 'స్టార్స్' ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నంది. ఇటువంటి ప్రాజెక్టునే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు రూ.5,800 కోట్ల రుణంతో గుజరాత్, తమిళనాడు, ఉత్తరాఖండ్, జార్ఖండ్, అసోంలో త్వరలో అమలు చేస్తుంది.
పర్యవసానాలు
ప్రపంచబ్యాంకు పాఠశాల విద్యలో తీసుకొస్తున్న ఈ మార్పులు సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. విద్యార్థుల, పాఠశాలల ప్రమాణాలు, ఫలితాలు, అంచనాలు, నియంత్రణ, పాఠ్య ప్రణాళికలు ఇంత వరకూ రాష్ట్ర ప్రభుత్వాలే చూసేవి. ఇప్పుడు పిఎఆర్‌ఎకెహెచ్ ఏర్పాటు చేయడం ద్వారా వీటిని రాష్ట్రాల నుంచి కేంద్రం తన చేతుల్లోకి తీసుకోనుంది. ఇది రాష్ట్రాల్లో పాఠశాల విద్య పని తీరును తీవ్రంగా దెబ్బ తీస్తోంది. పరీక్షా ప్రమాణాలను దేశమంతటికీ కేంద్రమే రూపొందించడం వల్ల అత్యంత కేంద్రీకరణకు గురై వెనుకబడిన ప్రాంతాలు, తరగతుల ప్రయోజనాలు దెబ్బ తింటాయి. బోధన లోనూ, పాఠశాలల పాలన లోనూ టెక్నాలజీని అతిగా వినియోగించడం...సాంకేతికంగా వెనుకబడిన తరగతుల చొరవను దెబ్బ తీస్తుంది. వీటి ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా చేసిన నిర్ణయాలు విద్యా వ్యాపారానికి దారితీస్తాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను వినడం, పర్యవేక్షించడం, విశ్లేషించడం అనే ప్రక్రియ అమలుగాకుండా పోతుంది. విద్యా వ్యవస్థలో ఫలితాలు, ప్రమాణాలు, అంచనాలు వంటి ప్రక్రియలు మెరిట్ ఆధారంగా జరగాలని పదే పదే వల్లెవేయడం అంటే సామాజిక న్యాయం దెబ్బ తీయడమే. ఈ ప్రాజెక్టు పాఠశాలలకు ప్రభుత్వం అందించాల్సిన సహాయం గురించి ఏమీ చెప్పలేదు. అంటే అన్ని స్థాయిల్లో ఉన్న ఖాళీల భర్తీ, నిధుల కొరత, మౌలిక వసతుల సమస్యల గురించి ఏమీ మాట్లాడలేదు. కాని, ఫలితాలకు విద్యార్థులను, పాఠశాలలను బాధ్యులు చేస్తోంది. చదివించే బాధ్యత తల్లిదండ్రులదే. చదివే బాధ్యత విద్యార్థులదే. ప్రభుత్వానికి ఏమీ బాధ్యత లేదు. ఇది కార్పొరేట్ తరహా పాలనా సంస్కరణ. అంతేగాక, విద్యా హక్కు చట్టానికి విరుద్ధం. ఒకవైపు ప్రభుత్వ బాధ్యతను తగ్గిస్తున్న ఈ ప్రాజెక్టు మరో వైపు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో పాలన, యాజమాన్యం, మానిటరింగ్, ఉపాధ్యాయ శిక్షణ, సేవలందించడం వంటి కీలకమైన అంశాల్లో ప్రైవేట్ పాత్రధారులకు ప్రవేశం కల్పిస్తోంది. సమన్వయం పేరుతో ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాలలను జత చేస్తారు. పూర్వ శిశువిద్య అంటే బాలల సంరక్షణ, సమగ్ర వికాసానికి అనే '2013 ఇసిసిఇఇ' అవగాహనకు భిన్నంగా...దీన్ని భవిష్యత్తుకు పెట్టుబడిగానూ, ఆర్థిక అభివృద్ధికి, ఉద్యోగిత కోసం పూర్వ శిశువిద్య అని నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) అభివర్ణించింది. ప్రస్తుతం పూర్వ శిశు విద్యలో లేని కోటి మందిని పాఠశాల విద్యలో భాగం చేయడమంటే అది మార్కెట్ విస్తరణే లక్ష్యం. ఆరో తరగతి నుంచే వృత్తి విద్య అన్న ఎన్‌ఇపి ప్రతిపాదన అమలుకు 'స్టార్స్' కేంద్రీకరిస్తుంది. ఇది సామాజికంగా అసమానతలను పున:ప్రతిష్టించి, గట్టిపరుస్తోంది. అన్నిటి కంటే 'స్టార్స్' ప్రాజెక్టు ప్రమాదం ఏమంటే ఇది మెరుగైన లేబర్ మార్కెట్ ఫలితాలు సాధించే విధంగా పరివర్తన చెందాలని చెబుతుంది. అంటే ఇది విద్య మౌలిక లక్ష్యాన్నే మార్చేస్తోంది. విద్యను జ్ఞాన సముపార్జన, సమగ్ర వికాసానికి కాక, కేవలం కార్పొరేట్ జాబ్ మార్కెట్‌కు అవసరమైన వారిని తయారు చేయడమే విద్య లక్ష్యంగా మారుస్తున్నారు. మరోవైపు విద్యనే పెద్ద మార్కెట్‌గా మారుస్తున్నారు.
మన దేశంలో 1994-2003 వరకు 'డిపెప్' పేరుతో మొదటి విడత, 2004 నుంచి 'సర్వశిక్షాభియాన్' పేరుతో రెండో విడత ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అమలయ్యాయి. వీటి అమలుపై సామాజిక తనిఖీలు కానీ, సమీక్షలు కానీ లేవు. ప్రభుత్వ రంగంలో పాఠశాలలు మరింత దిగజారిపోయాయి. నాణ్యమైన విద్య ప్రైవేట్ రంగంలో...నాసిరకమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అనే విధంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడిన పేదలు కూడా వాటిపై విశ్వాసం కోల్పోయి ప్రైవేట్ బాట పట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. విద్యా వ్యాపారానికి గిరాకీ కల్పించే వ్యూహాన్ని ప్రపంచ బ్యాంకు అమలు చేసింది. ఇప్పుడు మూడో దశ 'స్టార్స్' ప్రోగ్రాం రాష్ట్రాల భాగస్వామ్యాన్ని రద్దు చేస్తోంది. పాఠశాల విద్యకు చెందిన ప్రతి అంశాన్ని కేంద్రం చేతుల్లో పెట్టి అత్యంత కేంద్రీకరణ ద్వారా దేశ వ్యాప్తంగా ఏకీకృత విద్యా మార్కెట్‌ను తయారు చేయడం, చౌకగా శ్రామికులను లేబర్ మార్కెట్‌కు సరఫరా చేయడం దీని అసలు లక్ష్యం. ప్రజలు, ప్రజాతంత్రవాదులు ఈ దుర్మార్గాన్ని పసిగట్టి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(వ్యాసకర్త యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి)
కె. శేషగిరి










