Dec 26,2022 19:42

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌, జెసి

ప్రజాశక్తి - రాయచోటిహొ: స్పందన ఆర్జీలను నిర్లక్ష్యం చేయకుండా గడువు లోపల పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ తమిమ్‌ అన్సారీయ, ల్యాండ్‌ అండ్‌ సర్వే ఏడీ జయరాజు, ప్రజల నుంచి వచ్చిన ఆర్చీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తుంటారన్నారు. అధికారులు బాధితుల సమస్యలు గుర్తించి వెంటనే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక పంపాలన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపల క్లియర్‌ అయ్యేటట్లు చూడాలన్నారు. స్పందనలో ఎక్కువగా భూ సమస్యలు, పంచాయతీరాజ్‌ శాఖ, సివిల్‌ సప్లయిస్‌, డిపిఒ, పబ్లిక్‌ హెల్త్‌, తదితర శాఖలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయని వీటిపై ప్రత్యేక దష్టి సారించి పరిష్కరించాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్‌ ఎస్‌ఎలోకి వెళ్లకుండా నాణ్యతతో గడువు లోపల పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ఈసమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.