Feb 24,2023 22:03

ఫొటో : ఆర్‌.డి. జి.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేస్తున్న వేదిక నాయకులు

సమస్యలు పరిష్కరించాలని వినతి
ప్రజాశక్తి-కావలి : తాగునీరు, పారిశుధ్య, మున్సిపల్‌ అవినీతి, తదితర సమస్యలపై మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరావుని కావలిలో ''ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక'' శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. కావలి పట్టణంలో మంచినీటి ఎద్దడికి తక్షణమే చర్యలు తీసుకోవాలని, మెరుగైన పారిశుధ్యం కోసం చర్యలు తీసుకోవాలని, మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేయాలని కోరింది. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్‌ కరవదిభాస్కర్‌, జ్యోతి బాబురావు, పసుపులేటి పెంచలయ్య, గడే.నాగార్జున, వై.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ కావలిపట్టణంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, గత10రోజులుగా పట్టణప్రజలకు తాగునీరు అందించలేని దుస్థితిలో మున్సిపల్‌ అధికారులు ఉన్నారని విమర్శించారు.
నీటి పైపులు పగిలిపోవడం రిపేరు చేయడం నిత్యం జరుగుతున్నాయని, రిపేర్ల వల్ల రోజుల తరబడి తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వీటికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకే మున్సిపాలిటీ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ట్యాంకర్లకు పెడుతున్న ఖర్చు ఫలితంగా మున్సిపల్‌ ఖజానాకు భారీగా గండి పడుతుందన్నారు. అమృత పథకం కింద తాగునీటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఓవర్‌ హెడ్‌ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల నిర్మాణం గతంలోనే దాదాపు పూర్తయినా కూడా వాటిని తక్షణమే పూర్తి చేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదో అర్థం కావడం లేదని తెలిపారు. కనుక తక్షణమే అమృత పథకం పనులను పూర్తి చేసి తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలన్నారు. మోటార్లు రిపేరు పేరుతో లక్షల రూపాయలు అవినీతి జరుగుతుందన్నారు. రిపేరుకు పెట్టే ఖర్చుతో కొత్త మోటార్లు చాలా కొనవచ్చన్నారు. అంతేకాక కావాలనే శాశ్వత పరిష్కారం చూడకుండా ట్యాంకర్లతో తోలి సొమ్ము చేసుకోవాలని అధికారులు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. కావలి పట్టణంలో పారిశుధ్యం దారుణంగా ఉందన్నారు. గత 4 సంవత్సరాలుగా దోమల నివారణకు ఫాగింగ్‌ లేదన్నారు. కాలువల వద్ద బ్లీచింగ్‌ లేదన్నారు. ఇప్పుడు ఏదో నామమాత్రంగా కొన్ని చర్యలుచేపడుతున్నారని తెలియజేశారు. పట్టణంలో పందులకు కొదవ లేదని, కావలి పారిశుధ్యానికి పందులు తీవ్ర ఆటంకంగా మారాయన్నారు. అయినా వాటి నివారణకు మున్సిపల్‌ ఏ చర్యలు తీసుకోవడం లేదన్నారు. పైగా పట్టణ జనాభాకు తగిన విధంగా కార్మికులు, సిబ్బంది లేరని, ఉన్న కార్మికుల మీదే ఎక్కువ భారం పడుతుందని తెలిపారు. కనుక కార్మికులను, సిబ్బందిని పెంచి పారిశుధ్యం మెరుగుపర్చాలన్నారు. కావలి మున్సిపాల్టీలో అవినీతి విలయతాండవం చేస్తుందని తెలిపారు. అక్రమ లేఅవుట్లకు, అక్రమ అపార్టమెంట్ల నిర్మాణాలకు, అక్రమ షాపింగ్‌మాల్స్‌ నిర్మాణాలకు నిలయంగా మారిందని, మున్సిపాల్టీ స్థలాల ఆక్రమణ యథేచ్ఛగా జరుగుతుందన్నారు. మున్సిపాల్టీలో ఏ అనుమతులకైనా సరే భారీ మెత్తంలో ప్రజలు ముడుపులు చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. మున్సిపల్‌ అథారిటీ లేని రశీదులతో, ప్రజల నుండి పన్నుల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారన్నారు. ఇలా అనేక అవినీతి, ఆక్రమణలు జరుగుతున్నాయని, తక్షణమే విచారణ జరిపించాలన్నారు.