సమస్యల వలయంలో అన్నమయ్య ఆర్టీసీ డిపో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా క్వార్టర్లు
రాజంపేట అర్బన్ : పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయా రైంది రాజంపేట అన్నమయ్య ఆర్టీసీ డిపో. రాజంపేట, రైల్వే కోడూరు రెండు నియోజకవర్గాలకు కలిపి రాజంపేట అన్నమయ్య ఆర్టీసీ డిపో ఏకైక కేంద్రమైనప్పటికీ ఇక్కడ తగిన సౌకర్యాలు లేక వెలవెలబోతోంది. తవ్వే కొద్దీ అనేక సమస్యలు ఇక్కడ బయటపడుతున్నాయి. అన్నమయ్య ఆర్టీసీ డిపో సమస్యల వలయంలో ఉందని చెప్పడంలో సందేహం లేదు.
వేధిస్తున్న బస్సు సర్వీసుల కొరత
గత ఏడాది 100 బస్సు సర్వీసులతో కళకళలాడిన డిపో నేడు 75 సర్వీసులకే పరిమితమైంది. డిపో నుంచి శ్రీశైలం, చెన్నై, హైదరాబాద్, పెంచలకోన, మదనపల్లి, వేలూరు, కాణిపాకం, చిత్తూరు వంటి ప్రధాన ప్రాంతాలకు సర్వీసులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం ఐదు దాటితే తిరుపతి వైపు గానీ, వందలాది గ్రామాలు ఉన్న రైల్వే కోడూరు, చిట్వేల్‌కు గానీ బస్సు సర్వీసులు లేకపోవడంతో సాయంత్రం ఐదు నుంచి చిట్వేలి, రైల్వేకోడూరు మార్గాలలో వందలాది మంది ప్రయాణికులు వేచి ఉంటూ చివరకు ఆటోలు, జీపులలో ప్రయాణించాల్సి వస్తోంది. వాహనదారులు కాసులకు కక్కుర్తి పడి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని చిట్వేలికి, రైల్వేకోడూరుకు వాహనాలను తిప్పుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ మార్గాలలో బస్సు సర్వీసులను పెంచి సాయంత్రం ఐదు తర్వాత బస్సులను అందుబాటులో ఉంచితే సంస్థకు లాభాలతో పాటు ప్రజలకు సౌకర్యం కల్పించినట్లు ఉంటుందని పలువురు అభిప్రాయపడడుతున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా
ప్రథమ వాగ్గేయకారుడు, పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల పేరు మీదుగా స్థాపించబడిన రాజంపేట అన్నమయ్య ఆర్టీసీ డిపో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి కేటాయించిన ఆర్టీసీ క్వార్టర్లులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు ఖాళీ చేయడంతో ఆ గహాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఆ క్వార్టర్లు మందు బాబులకు, పేకాట రాయుళ్లకు అడ్డాగా మారి చెత్త-చెదారంతో మురికి కూపంగా తయారైంది. దీంతో ఆ గహాలు పందులు, కుక్కలు, దోమలకు ఆవాసమై విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయి.
డిపో కేంద్రానికి రాని బస్సు సర్వీసులు
రాజంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రమైనప్పటికీ రాజంపేటతో పాటు రైల్వే కోడూరుకు కూడా రెండు నియోజకవర్గాలకు ఒకటే ఆర్టీసీ డిపో. అయినప్పటికీ ఆర్టీసీ డిపోలోకి కర్నూల్, నంద్యాల బస్సులతో పాటు కొన్ని సర్వీసులు రాకపోవడం చేత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డిపోలోకి రాకుండా సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని బైపాస్ గుండా వెళుతూ ప్రయాణికులను అక్కడే దించివేయడంతో రాత్రి వేళ మహిళా ప్రయాణికులు, వద్దులు, చిన్నపిల్లలు వారి గమ్యానికి చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో టిడిపి హయాంలో రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రీజనల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు అన్ని బస్సులను ఆర్టీసీ డిపోలోకి వచ్చేందుకు కషి చేసి సఫలీకతులయ్యారు. నేడు మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుండడంతో బస్సు సర్వీసులను డిపోలోకి రప్పించాలని ప్రజలు కోరుతున్నారు.
దిష్టిబొమ్మను తలపిస్తున్న పెట్రోల్ బంకు
ఆర్టీసీని అభివద్ధి పథంలో నడిపేందుకు సంస్థ చేస్తున్న అనేక ప్రయత్నాలలో భాగంగా డిపో పరిధిలోనే పెట్రోల్ బంకును నిర్మించాలన్న సత్సంకల్పంతో డిపో ఆవరణలో ముందు భాగాన పెట్రోల్ బంకు నిర్మాణానికి పూనుకొని పన్ను చెల్లించే క్రమంలో ఎదురైన సమస్య కారణంగా పెట్రోల్ బంకు నిర్మాణం ఆదిలోనే ఆగిపోవడంతో డిపో ముందు దిష్టి బొమ్మలా దర్శనమిస్తోంది. అసంపూర్తిగా ఉండడంతో మందుబాబులు దీనిని బారులా వినియోగిస్తున్నారు. దీంతో డిపోలోకి ఆ మార్గం గుండా వెళ్లే ప్రయణీకులు చాలా అసౌకర్యానికి గురౌతున్నారు. డిపో మేనేజర్ చొరవ తీసుకొని పెట్రోల్ బంకు నిర్మాణం పూర్తి చేస్తే సంస్థకు ఆదాయ వనరుగానే కాక ఆకర్షణీయంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరమ్మతులకు నోచుకోని వాటర్ ప్లాంట్
గ్యారేజీలో పని చేసే ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి దాహార్తిని తీర్చే వాటర్ ప్లాంటు చెడిపోయి ఏడాదికి పైగా కావస్తున్నా మరమ్మతులకు నోచుకోకపోవడంతో కార్మికులతో పాటు ఆర్టీసీ సిబ్బంది మంచినీటి కోసం అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. వాటర్ ప్లాంటులో తాగు నీరు అందుబాటులో ఉన్నా, యంత్రాలు చెడిపోయి చల్లని నీరు రాక సిబ్బంది వేసవి తాపానికి గురవుతున్నట్లు సమాచారం.
వధాగా క్యాంటీన్, వాణిజ్య గదులు
బస్సు సర్వీసులు అన్నమయ్య డిపోలోకి రాకపోవడంతో ప్రయాణికులు తక్కువ కావడం చేత చాలాకాలంగా క్యాంటీన్, వాణిజ్య గదులు మూతపడి ఉన్నాయి. కనీసం మంచినీరు కావాలన్నా డిపో బయటికి వెళ్లి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పార్కింగ్ లేక అస్తవ్యస్తంగా వాహనాలు
డిపో ఆవరణలో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు అస్తవ్యస్తంగా పార్కింగ్ చేసి డిపోలోకి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా ప్రధాన ద్వారం వద్ద కూడా అడ్డంగా వాహనాలు నిలుపుతున్నారు. డిపో ఆవరణలో పార్కింగ్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటమే గాక సంస్థకు ఆదాయాన్ని చేకూర్చే మార్గం కూడా లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సమస్యలను చక్కదిద్దుతున్నాం : డిఎం
క్యాంటీన్, పార్కింగ్ స్థలానికి మే 15న టెండర్లు పిలుస్తున్నామని, పెట్రోల్ బంకు నిర్మాణానికి అభివద్ధి పన్ను చెల్లించి త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని డిపో మేనేజర్ జి.రమణయ్య తెలిపారు. బస్సు సర్వీసులను డిపోలోకి రప్పించేందుకు ప్రధాన రహదారిలో సిబ్బందిని నియమించి బస్సులను డిపోలోకి రప్పిస్తున్నామని, చార్టర్‌లో కూడా సంతకాలు చేస్తున్నారని తెలిపారు. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు డిపో ఆవరణలో కంట్రోల్ పాయింట్ వద్ద దాతల ద్వారా వాటర్ కూలర్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తుల కషి చేస్తున్నామని తెలియజేశారు.బస్టాండ్ ముందు వాహనాల పార్కింగ్










