ఫిరోజ్‌బాద్ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఫేస్‌బుక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ సహర్‌యార్ అలీ ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజ్‌బాద్‌లోని కోర్టులో సరెండర్ అయ్యారు. అనంతరం ఆయన్ను జైలుకు తరలించారు. అదనపు జడ్జి అనురాగ్ కుమార్ ఎదుట సరెండరైన అలీ... మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జడ్జి బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. అనంతరం జైలుకు తరలించారు. ఎస్‌ఆర్‌కె కాలేజీలో హిస్టరీ విభాగంలో హెడ్‌గా వ్యవహరిస్తున్న అలీ... మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతిపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ నోటీసునిచ్చింది. ఇదే కేసులో అరెస్టు నుండి రక్షణ కల్పించాలంటూ అలీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల మొదట్లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ న్యాయస్థానం కూడా తోసిపుచ్చింది.










