సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార భేరి
ప్రజాశక్తి-కావలి : వామపక్ష పార్టీల పిలుపు మేరకు మంగళవారం కావలి పట్టణం వెంగళరావునగర్ 22వవార్డు, పాత మసీదు, నవవికాస్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో ''ప్రచార భేరి'' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ పరిశ్రమన్నీ అందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తుందన్నారు. రాజ్యాంగానికి మూల స్తంభాలుగా ఉన్న ప్రజాస్వామ్య, లౌకికతత్వం, సామాజిక న్యాయం వంటి గొప్ప విలువలను ఈ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, అంటూ పాలన చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం వెంగళరావు నగర్ ఏరియా కార్యదర్శి పసుపులేటి పెంచల నరసింహ, నాయకులు బోగిశెట్టి కిష్టయ్య, చెన్నయ్య, అన్వర్ భాషా, సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణ మోహన్, డివైఎఫ్‌ఐ నాయకులు కోటేశ్వరరావు, ప్రభాకర్, స్థానికులు పాల్గొన్నారు.










