చెన్నై : సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ మృతిచెందారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముందు వెళ్తున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢకొీంది. ఈ ప్రమాదంలో ఆయన కళ్లకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహేశ్‌ను హుటాహుటిన నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న మహేశ్ హెల్త్ బులెటిన్‌ను వైద్యులు ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వచ్చారు. ఒకానొక దశలో కోలుకుంటున్నాడని కూడా వెల్లడించారు. అయితే, ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం దక్కలేదు. పరిస్థితి విషమించడంతో శనివారం సాయంత్రం మృతిచెందారు. ఇదిలా ఉండగా, కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం ఎపి ప్రభుత్వం రూ.17 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. కత్తి మహేశ్ మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.










