Jan 03,2022 13:02

సిలిగురి :  సిలిగురి మునిసిపల్‌ కార్పోరేషన్‌ (ఎస్‌ఎంసి) ఎన్నికల్లో సిపిఎం మరోసారి విజయం సాధించేందుకు సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో పశ్చిమబెంగాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

ఎస్‌ఎంసిలో ప్రస్తుతం సిపిఎం అధికారంలో ఉంది. సిపిఎంకి కంచుకోటైన సిలిగురిలో 2015లో జరిగిన ఎస్‌ఎంసి ఎన్నికల్లో 47 స్థానాలకు గాను సిపిఎం, మిత్రపక్షాలు 23 స్థానాల్లో విజయంసాధించాయి. టిఎంసి 17 సీట్లను గెలుచుకుంది. సిలిగురి మహాకుమా పరిషద్‌ పోల్స్‌లో కూడా తొమ్మిది స్థానాలకు గాను ఆరు స్థానాలను సిపిఎం కైవసం చేసుకుంది.

వచ్చే ఎన్నికలకు గాను ఇప్పటికే పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఎస్‌ఎంసి ప్రస్తుత మేయర్‌గా ఉన్న అశోక్‌భట్టాచార్య నేతృత్వంలో పార్టీ ఎన్నికల్లో తలపడనుంది. మాజీ డిప్యూటీ మేయర్‌ నురుల్‌ ఇస్లామ్‌ కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మొత్తం 47 స్థానాలకు గాను 43 స్థానాల్లో సిపిఎం పోటీ చేయనుంది. కాంగ్రెస్‌ 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, బిజెపి, టిఎంసి 47 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అశోక్‌ భట్టాచార్య మాట్లాడుతూ.. తాను పోటీ చేయాలని పార్టీ పట్టుబట్టిందని, దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ఎస్‌ఎంసిలో గతంలో అధికారంలో ఉన్న టిఎంసి పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రజలు అధికారులను కలిసేందుకు ప్రజలు రాకుండా మునిసిపల్‌ కార్పోరేషన్‌ కార్యాలయం ఎదుట భారీగేటును నిర్మించారని విమర్శించారు. టిఎంసి కౌన్సిలర్లు లంచాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 20 ఏళ్లపాటు ఆయన మంత్రిగా విధులు నిర్వహించారు. 1994లో సిలిగురి మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఏర్పడినప్పటి నుండి పార్టీని ముందుండి నడిపించారు. అత్యధిక మెజారిటీతో అనేక సార్లు ఎన్నికయ్యారు.

తాను ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని 4వ వార్డు అభ్యర్థి సౌరవ్‌ శంకర్‌ తెలిపారు. ఈ స్థానంలో విజయం సాధించిన అభ్యర్థి పరిమళ మిత్ర అనంతరం టిఎంసిలో చేరారని,  ఇటువంటి ద్రోహులను ప్రజలు నమ్మరని అన్నారు. గతంలో ఎస్‌ఎఫ్‌ఐ డార్జిలింగ్‌ జిల్లా అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన  సౌరవ్‌ని 4వ వార్డు అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు అవకాశాలు కల్పించే పార్టీకి తాము మద్దతునిస్తామని, అశోక్‌భట్టాచార్య హయాంలో ప్రశాంత వాతావరణం ఉందని నిత్యావసరాల దుకాణదారుడు జిష్ణు హవల్దార్‌ పేర్కొన్నారు. సిపిఎంపైనే ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉందని ఎస్‌బిఐ ఉద్యోగి నిరుపమ్‌ మిత్ర అన్నారు.