Sep 24,2023 00:04

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. వర్షాలకు పల్లపు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండి దోమలు పెరగడంతోపాటు కలుషిత నీటి సరఫరా తదితర కారణాలతో విష జ్వరాలు, డయేరియా (అతిసార), టైఫాయిడ్‌, డెంగీ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో తరచూ కురుస్తున్న వర్షాలతో పల్లపు ప్రాంతాల్లో, ఖాళీ నివాస స్థలాల్లో నీరు నిల్వ ఉండిపోతోంది. తద్వారా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, గుడివాడ, పెడనతోపాటు విజయవాడ సమీపంలోని పెనమూలూరు, ఉప్పులూరు, కంకిపాడు ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో డెంగ్యూ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. డెంగీ నిర్ధారణ ఎలీసా పరీక్షలు మచిలీపట్నం, గుడివాడ ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ప్రయివేటు ల్యాబ్‌లో పరీక్షలను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే మచిలీపట్నంలో 15, పెడనలో 4, గుడివాడలో 2, విజయవాడకు సమీపంలోని పెనమలూరు, ఉప్పులూరు, కంకిపాడు పిహెచ్‌లతోపాటు జిల్లాలోని ఇతర పిహెచ్‌సిల్లో సుమారు 50 వరకు డెంగ్యూ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. జ్వరాలకు సంబంధించి ప్రభుత్వాస్పత్రుల్లో నమోదైన కేసులనే వైద్య ఆరోగ్యశాఖ పరిగణలోకి తీసుకోంటోంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు జ్వరాల కేసులు 6,210, డయేరియా కేసులు 437, టైఫాయిడ్‌ కేసులు 810 నమోదయ్యాయి. జూన్‌, జూలై, ఆగస్టు నెలలతో పోల్చుకుంటే సెప్టెంబర్లో జ్వరాలు, టైఫాయిడ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రయివేటు ఆస్పత్రులు, ఆర్‌ఎంపిల వద్ద చికిత్స అందుకునే వారి సంఖ్యను చూస్తే ఈ లెక్కలకు అనేక రెట్లు అధికంగా ఉంటుంది. ఆసుపత్రులన్నీ వ్యాధి పీడితులతో కిటకిటలాడుతున్నాయి.
నీటి కాలుష్యంతో టైఫాయిడ్‌, డయేరియా
నీటి, ఆహార కాలుష్యం కారణంగా డయేరియా, టైపాయిడ్‌ వ్యాపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వాటర్‌ సప్లరు స్కీంల ఫిల్టర్‌ బెడ్లు కొన్ని ప్రాంతాల్లో పాడైపోయినా పట్టించుకోకపోవడం. పైప్‌లైన్ల లీకులకు సకాలంలో మరమ్మతులు నిర్వహించకపోవడం తదితర కారణాలతో జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మూడు నెలల 15 రోజుల వ్యవధిలోనే 810 టైఫాయిడ్‌, 437 డయేరియా కేసులు నమోదయ్యాయి.