మాట్లాడుతున్న రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి
సిఎం మెడలో పూలమాల వేస్తా...
నెల్లూరు:రూరల్ నియోజకవర్గ పరిధిలో చాలా కాలంగా నెలకొని ఉన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మెడలో పూలమాల వేసి సన్మానం చేస్తానని రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రూరల్ ఎంఎల్‌ఎ కార్యాలయంలో 'రూరల్ ప్రజల గొంతుక' పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో పలు ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ , రెవెన్యూ శాఖ మంత్రిని, చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిని తాను నేరుగా కలిసి పలు మార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం శూన్యమని వాపోయారు. ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని రోడ్లు కాలువలు, పొట్టే పాళెం కలుజు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ భవన్, అంబేద్కర్ భవన్, కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వంటి పలు సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యంగా పొట్టేపాళెం కలుజు ప్రాంతంలో ప్రతినిత్యం చోటు చేసుకుంటున్న ప్రమాదాలను సిఎం దృష్టికి తీసుకెళ్లామని,ఈ సమస్యలన్నింటితో పాటు బారాషాహిద్ దర్గాకు మంజూరు చేసిన నిధులకు సంబంధించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభించక పోవడంతో పలు సమావేశాల్లో జిల్లా అధికారులను, మంత్రులను ప్రశ్నించామన్నారు. అంతే కాకుండా ఈ సమస్యలన్నింటినీ సిఎం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వాటికి పరిష్కారం లభించకపోగా తన ఫోన్ ట్యాంపింగ్ చేశారన్నారు. ఈ సమస్యలన్నింటిని ప్రభుత్వం పరిష్కరిస్తే రాష్ట్రంలోనే జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా ఏప్రిల్ నుంచి రూరల్ నియోజకవర్గ పరిధిలో ప్రజా ఆశిస్సుల యాత్ర పేరుతో 141 రోజుల పాటు పర్యటిస్తామన్నారు. ఈ పర్యటనలో ప్రతి ఇంటిని సందర్శిస్తానని, టిఫిన్, భోజనం, రాత్రి సమయంలో ప్రజల ఇళ్లలోనే నిద్రిస్తామన్నారు. ప్రతి ఒక్కరు తనను ఆదరించాలని కోరారు. అధికారంలో ఉన్నామా.. దూరంగా ఉన్నామా అన్నది ప్రశ్న కాదని, ప్రజల పక్షాన నిలవాలని తపన కలిగిన వ్యక్తిని తానన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని శివారు ప్రాంతాలు వేగవంతంగా పెరిగిపోతున్నాయి, ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు సౌకర్యం లేదని వాపోయారు. రూరల్ నియోజకవర్గం లో ఉన్న సమస్యలను ప్రశ్నించారని తన ఫోను టాపింగ్ చేశారని ఇక అనుమానించిన చోట ఉండకూడదన్న భావనతో అధికార పార్టీ నుంచి బయటికి వచ్చి పోరాట పంధాను ఎంచుకున్నామన్నారు. ప్రభుత్వం మెడలో ఉంచే వరకు పోరాటం సాగుతుందని రూరల్ ప్రజలను పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వాములు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ప్రజల భవిష్యత్తు కోసమే తమ పోరాటమన్నారు. నెల్లూరు రూరల్ లో ఉన్న సమస్యల కోసం ఎందాకైనా పోరాటానికి సిద్ధమన్నారు. ఈ పోరాటంలో ఎన్ని ఇబ్బందులు ఉన్న ముందుకు వెళ్తామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి రూరల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు తరలిరావడంతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కిక్కిరిసి పోయింది. 'రూరల్ ప్రజల గొంతుక' కార్యక్రమంలో ఎంఎల్‌ఎ ప్రసంగిస్తున్న తరుణంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఓ దశలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. రూరల్ నియోజకవర్గం పదిమంది కార్పొరేటర్ల తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు










