ప్రజాశక్తి-హిందూపురం : ఎస్కేయు నిర్వహించిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని కళాశాల వసతిగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఎస్కేయు డిగ్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిందని అందులో కేవలం 31శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఎస్కేయు పరీక్షల విభాగం నిర్లక్ష్యం కారణంగా 69 శాతం మంది విద్యార్థిని, విద్యార్థులు డిగ్రీ నాల్గవ సెమిస్టర్‌లో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఫెయిల్ అయిన విద్యార్థుల పేపర్లను రీవాల్యుయేషన్ ఉచితంగా చేయాలని కోరారు. పేపర్ కరెక్షన్‌లో కొంతమంది లెక్చరర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే పరీక్ష బాగా రాసిన విద్యార్థులు సైతం ఫెయిల్ అవుతున్నారని విమర్శించారు. ఇలా కావటం ఇది మొదటి సారి కాదని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న అలాంటి లెక్చరర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో ఎస్‌కె కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హర్షకుమార్, భగత్, అభి, మహేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.










