Nov 17,2021 07:03

వ్యవసాయ పంప్‌సెట్లకు విద్యుత్‌ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వ పరిధి లోని సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) నుండి రాష్ట్ర ప్రభుత్వం 7,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలు వ్యవహారంపై గడచిన రెండు నెలలుగా వాద ప్రతివాదనలు, పలు చర్చలు జరుగుతున్నాయి. అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కాని, అప్పుడప్పుడు అరకొరగా వివరాలివ్వడం తప్ప సందేహాలన్నిటినీ పూర్తి స్థాయిలో నివృత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రయత్నం చేయడంలేదు. అదానీ కంపెనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదో గూడుపుఠాణీ జరుగుతోందని జనం అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా సంబంధిత అంశాలపై ఎపి విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (ఇఆర్‌సి) బహిరంగ విచారణ జరపకుండానే విద్యుత్‌ కొనుగోలుకు సెకి, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కాములు త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వు ఇవ్వడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్‌ పేరిట జరుగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిద్దాం.
పంప్‌సెట్లకు కరెంటు కోసం ప్రత్యేక కార్పొరేషన్‌
రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి కోసమంటూ 2014 నవంబర్‌లో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (సెకాప్‌)ను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెకి, రాష్ట్ర జెన్‌కో, రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల కార్పొరేషన్‌ ఇందులో భాగస్వాములు. దాని పరిధిలోనే అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో సుమారు 4,000 మెగావాట్ల స్థాపక సామర్ధ్యంతో సౌర విద్యుత్‌ పార్కులు స్థాపించబడ్డాయి కూడా. అయితే, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చాక 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేసి వ్యవసాయ పంప్‌సెట్లకు సరఫరా చేయడానికంటూ పూర్తిగా రాష్ట్ర జెన్‌కో పరిధి లోని కంపెనీగా ఎ.పి గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎపిజిఇసిఎల్‌)ను 2020 మార్చి 3న ఏర్పాటు చేసింది. తొలి దశలో 10 ప్రదేశాల్లో మొత్తం 6,050 మెగావాట్ల ఉత్పత్తికి సంబంధించిన టెండర్లను 2020 జూన్‌లో జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపింది. ఆ టెండర్లకు స్పందించి యూనిట్‌ రూ.2.47 మొదలు రూ.2.58 వరకు కోట్‌ చేశారు. తక్కువ కోట్‌ చేసినవారిలో అదానీ రెన్యువబుల్‌ ఎనర్జీ, టోరెంట్‌, ఎన్‌టిపిసి, అజ్యూర్‌ పవర్‌ తదితర సంస్థలున్నాయి. అయితే, ఎపిజిఇసిఎల్‌ అనేది విద్యుదుత్పత్తిదారు గానీ లైసెన్సీ గానీ కాదు కనుక టెండర్లు పిలిచే అధికారం లేదనీ విద్యుత్‌ చట్టం (2003)ను ఉల్లంఘించడమేనన్న అభియోగంతో టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ సంస్థ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. వాద ప్రతివాదనల అనంతరం ఆ టెండర్లను రద్దు చేయాలని 2021 జూన్‌ 17న హైకోర్టు తీర్పునివ్వడంతో ఎపిజిఇసిఎల్‌ కొనుగోలు ప్రక్రియకు బ్రేక్‌ పడింది.
హఠాత్తుగా రంగం మీదికి 'సెకి'
ఇదిలా ఉండగా సెకి తమ వద్ద అందుబాటులో ఉన్న 9000 మెగావాట్ల విద్యుత్తును యూనిట్‌ రూ.2.49 చొప్పున విక్రయిస్తామంటూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి 2021 సెప్టెంబర్‌లో లేఖ రాసింది. 2019 డిసెంబర్‌ నుండి 2020 జూన్‌ మధ్య నిర్వహించిన నాలుగు దశ(ట్రెంచ్‌)ల్లో 12000 మెగావాట్ల సౌర విద్యుత్‌ టెండర్లు ఖరారయ్యాయనీ వాటిలో 3000 మెగావాట్లు కొన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు వివిధ దశల్లో ఉన్నట్లు, మిగతా 9000 మెగావాట్లు ఎపి కొనుగోలు చేయవచ్చునని పేర్కొంది. అంతేగాక రాజస్థాన్‌ నుండి జాతీయ గ్రిడ్‌ ద్వారా ఇక్కడకు చేరడానికయ్యే ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సర్వీసెస్‌ (ఐఎస్‌టిఎస్‌) చార్జీలను (యూనిట్‌కు సుమారు ఒక రూపాయి నుండి రూ.1.25 వరకు అవుతుందని అంచనా) కేంద్ర ప్రభుత్వం 25 ఏళ్లపాటు ఉచితంగా ఇవ్వనుందని తెలిపినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. మీరు ఎపిజిఇసిఎల్‌ ద్వారా చేస్తున్న కొనుగోలు ప్రయత్నాల బదులు ఈ డీల్‌ కుదుర్చుకోవడం మంచిదని సెకి సలహా కూడా ఇచ్చిందట.
ఈ నేపథ్యంలో సెకి నుండి 7000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను యూనిట్‌ రూ.2.49 చొప్పున కొనుగోలు చేయాలని, వ్యవసాయ పంప్‌సెట్లకు 25 ఏళ్లపాటు సరఫరా కోసం దాన్ని వినియోగించాలని గడచిన సెప్టెంబర్‌ 21న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయితే, హైకోర్టు రద్దు చేసిన ఎపిజిఇసిఎల్‌ టెండర్లు, అలాగే సెకి తాజా ప్రతిపాదనలోని ప్రధాన విద్యుదుత్పత్తిదారు అదానీకి సంబంధించిన కంపెనీలే కావడం గమనార్హం. విద్యుత్‌ చట్టం(2003)కు విరుద్ధంగా ఉన్నాయని న్యాయ వ్యవస్థ అదానీ పవర్‌ టెండర్లు రద్దు చేస్తే వేరే రాష్ట్రం (రాజస్థాన్‌)లో తాము ఉత్పత్తి చేసిన విద్యుత్తును సెకి ద్వారా ఇక్కడి అమ్మకానికి పెట్టిందని బోధపడుతోంది. చట్ట నిబంధనల్ని ఉల్లంఘించడం, కోర్టు తీర్పుల నుండి తప్పించుకోవడానికి ప్రభుత్వ పెద్దలను, బ్యూరోక్రాట్లను 'మేనేజ్‌' చేయడంలో కార్పొరేట్లది అందె వేసిన చెయ్యి కదా! టాటా పవర్‌ సంస్థ తాను పొందలేని బిడ్‌ను అదానీకి దక్కకూడదనే తప్ప ఎపిజిఇసిఎల్‌ నిర్వహించిన టెండర్లకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది విద్యుత్‌ చట్టాన్ని అమలు చేయాలన్న పట్టుదలతో కాదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో సౌర విద్యుత్‌ పార్కు కలిగిన టాటా పవర్‌ కొత్తవాటిని కూడా దక్కించుకోవాలనే ప్రయత్నంలో కోర్టు కేసు ఒక భాగమే. ఈ వ్యవహారంలో రాష్ట్ర అభివృద్ధి మాటున కార్పొరేట్ల ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయన్నమాట.
నిజంగానే అది చౌక విద్యుత్తా...?
అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ సంస్థయైన ఎపిజిఇసిఎల్‌ నిర్వహించిన టెండర్లలో యూనిట్‌ రూ.2.47కు అతి తక్కువ బిడ్‌ దాఖలైంది. ఇక్కడే ఉత్పత్తి అవుతుంది కనుక దానికి ఐఎస్‌టిఎస్‌ చార్జీలుండవు. అలాంటపుడు సెకి ప్రతిపాదించిన రూ.2.49 కూడా ఎక్కువే కదా! నిజానికి సౌర, పవన హైబ్రిడ్‌ విద్యుత్‌ ఇంకా చౌకగానే లభిస్తోంది. యూనిట్‌ రెండు రూపాయల చొప్పున విక్రయానికి కొన్ని టెండర్లు ఖరారవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అంతేగాక ఐఎస్‌టిఎస్‌ చార్జీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ విషయంలోనూ భిన్నమైన వార్తలొస్తున్నాయి. 25 సంవత్సరాలపాటు రాయితీ ఇస్తారు కాని 2025 జూన్‌ 30వ తేదీ లోగా పూర్తయి, విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లకే అది పరిమితమని అంటున్నారు. సెకి ఒప్పందం చేసుకున్న ప్లాంట్లు ఆ లోగా ఉత్పత్తి ప్రారంభిస్తాయో లేదో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వానికిచ్చిన ఆఫర్‌లో 2024, 2025, 2026 సంవత్సరాల్లో సెప్టెంబర్‌ 30వ తేదీనాటికి ఏటా 3,000 మెగావాట్ల చొప్పున సరఫరా చేస్తామని పేర్కొంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చినా అది 2024లో సరఫరా ప్రారంభించిన విద్యుత్తుకే పరిమితమన్నమాట. ఆపై వచ్చే విద్యుత్‌కు ఐఎస్‌టిసి చార్జీల విషయంలో స్పష్టత లేదు. వీలింగ్‌ చార్జీలు, ఇతర నెట్‌వర్క్‌ ఖర్చుల విషయంలోనూ పలు సందేహాలు తలెత్తుతున్నాయి. కాబట్టి సెకి నుండి కొనుగోలు చేసేది నిజంగానే చౌక విద్యుత్తా? కాదా? అన్న సందేహం పలువురిలో కలుగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్‌పై 'సెకి' ప్రేమ ఎందుకో...!
ఆంధ్ర ప్రదేశ్‌కు ఐఎస్‌టిఎస్‌ చార్జీల రాయితీతో సహా విద్యుత్తునిస్తానని ఆఫర్‌ చేసిన సెకి నిజంగా ఈ రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల అంత సానుకూల వైఖరి గలదా అంటే అదీ అనుమానమే! తెలుగుదేశం హయాంలో అధిక ధర చెల్లించేలా పిపిఎలు జరిగాయనీ అలాంటివాటిని సమీక్షిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చెప్పారు. అయితే, ఏ కారణాలవల్లనో సమీక్ష మాత్రం జరగలేదు. ప్రభుత్వానికి ఉత్పత్తిదార్లకు ఘర్షణ నెలకొన్న క్రమంలో కొన్ని కంపెనీలు సరఫరా చేసిన విద్యుత్తుకు రాష్ట్ర డిస్కాములు సొమ్ము బకాయి పెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుండి బదలాయించవలసిన నిధులలో రూ.276 కోట్లను మినహాయించి ఆ కంపెనీలకు బకాయి చెల్లించాలని 2019 డిసెంబర్‌లో సెకి పట్టుబట్టింది. విద్యుదుత్పత్తిదార్లకు బకాయిలు లేకుండా చూసేందుకు, ఏవైనా డిస్కాములు బకాయి పడితే వాటి చెల్లింపులకు గ్యారెంటీ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం చాలా ఏళ్ల కిందటనే జరిగింది. ఇంతవరకూ ఆ ఒప్పందాన్ని ఎవరూ ఎప్పుడూ ఆచరణకు తేలేదు. కాని మొట్టమొదటిసారి ఎ.పి విషయంలో అమలులోకి తీసుకురావాలని పట్టుబట్టిందంటే ఈ రాష్ట్రం పట్ల, ప్రజలపట్ల సెకి వైఖరి ఏమిటో స్పష్టమవుతోంది.
గమనించవలసిన మరో విషయం ఏమిటంటే పేరుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థే అయినా, దేశ విదేశీ కార్పొరేట్‌ కంపెనీలు ఉత్పత్తి చేసే సౌర, పవన విద్యుత్తును ఆయా రాష్ట్రాల డిస్కాములకు అమ్మి పెట్టే ఒక వ్యాపార సంస్థ సెకి. టెండర్లు, ఒప్పందాలు, చెల్లింపుల సందర్భాల్లో వచ్చే వివాదాల ప్రాథమిక పరిష్కారం తదితర సేవలందించేందుకుగాను యూనిట్‌ విద్యుత్తుకు ఏడు పైసలు బిజినెస్‌ మార్జిన్‌గా వసూలు చేస్తుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్తో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి నిధులివ్వకుండా కార్పొరేట్‌ కంపెనీలకు మళ్లించాలన్న ఈ వ్యాపార సంస్థ తాజా ఒప్పందం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగే మేలెంత అన్నది సందేహమే!
ఈ ప్రశ్నలకు బదులేది?
ఈ నేపథ్యంలో (1) సెకి నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆఫర్‌ పూర్తి వివరాలు ఏమిటి? (2) ఐఎస్‌టిఎస్‌ మరియు ఇతర నెట్‌వర్క్‌ చార్జీలు ఎంతవుతాయి, వాటిని ఎవరు భరిస్తారు? (3) గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే సౌర విద్యుదుత్పత్తి చేయకుండా రాజస్థాన్‌ నుండి సెకి ద్వారా ఎక్కువ ధరకు, అంత భారీ మొత్తంలో ఎందుకు కొనుగోలు చేయాలి? వంటి ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలివ్వాలి. సంబంధిత పత్రాలను వెబ్‌సైట్లలో ప్రచురించి పారదర్శకంగా వ్యవహరించడం అవసరం. అలా చేయకపోతే ఈ కొనుగోళ్ల వెనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అదానీ కంపెనీకి లోపాయికారీ వ్యవహారం నడుస్తోందని ప్రజలు అనుకుంటారు.
ఎపిఇఆర్‌సి సరిదిద్దుతుందా...!
ఇంత భారీ విద్యుత్‌ కొనుగోలు విషయంలో అనేక అంశాల్లో నిర్వహించిన మాదిరిగా ఎపిఇఆర్‌సి బహిరంగ విచారణ జరపడం అవసరం. సరఫరా నెట్‌వర్క్‌ బలోపేతం చేయడం, వీలింగ్‌ చార్జీలతో సహా ఇతర ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఇఆర్‌సి షరతు విధించడం సరైనదే. అయితే ఇప్పటికిప్పుడే త్రైపాక్షిక ఒప్పందానికి అనుమతించడం ఒక క్వాజీ న్యాయ సంస్థయైన ఇఆర్‌సికి సమంజసం కాదని పలువురు అంటున్నారు. ఒకసారి ఒప్పందాలు చేసుకున్నాక 'తాంబూలాలిచ్చేశా.. తన్నుకు చావండి' అనే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదముంది.
ఇన్ని చిక్కు ముడులున్న ఈ వ్యవహారంలో పత్రాలన్నిటినీ ప్రభుత్వం ప్రజల ముందుంచి, వాటి ఆధారంగా ఇఆర్‌సి బహిరంగ విచారణ నిర్వహించాలి. అంతవరకు ఎలాంటి ఒప్పందాలు జరగకుండా ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయి.

                                                                                                                          బి. తులసీదాస్‌