ప్రజాశక్తి - సోమందేపల్లి : సచివాలయ ఉద్యోగులు యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలని కలెక్టర్ పి.బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని గుడిపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రం భవనం పూర్తి కాగా ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. సచివాలయ పరిధిలో చేపట్టాల్సిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డుకు సంబంధించి సర్వే ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సచివాలయంలో రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ వెంకటేశ్వర్లు, సర్పంచి గిరిజమ్మ నాగరాజు రావ్, పంచాయతీ సెక్రెటరీ నాగార్జున రెడ్డి, సచివాలయ ఉద్యోగులు బాలకృష్ణ, శ్రీదేవి, భారతి, నాగజ్యోతి, అశ్వర్థ, గీతమ్మ ,శివ , వాలెంటీర్లు తదితరులు పాల్గొన్నారు.










