ప్రజాశక్తి - పరిగి : ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలకు వేదికగా నిలచిన మండల సర్వసభ్యసమావేశంలో ఓ అధికారి అనుసరించిన తీరు విస్మయం కలిగిస్తోంది. ప్రజాసమస్యలపై సభ్యులు, అధికారులు సీరియస్‌గా చర్చిస్తున్న నేపథ్యంలో ఆ సమావేశంలో తన శాఖ తరపున పాల్గొన్న ఓ అధికారి ఏకంగా సెల్‌ఫోన్‌లో పేకాట గేమ్ ఆడుతూ కాలక్షేపం చేశాడు. ఈ సంఘటన పరిగి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో 'ప్రజాశక్తి' కంటపడింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు... పరిగి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిపి సవిత ప్రభాకర్ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ శాఖ తరపున హిందూపురం ఆర్టీసీ డిపో ఎడిసి అధికారి ఓంకార్ మూర్తి హాజరయ్యారు. సమావేశంలో పలు సమస్యలపై సభ్యులు, అదికారుల మధ్య చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యలతో తనకేం పని అనుకున్నాడేమో ఆ ఆర్టీసీ అధికారి ఓంకార మూర్తి. ఏదో టైంపాస్‌కు వచ్చినట్లు తన సెల్‌ఫోన్ తీసి అందులో పేకాట గేమ్ అడే పనిలో నిమగమయ్యాడు. మండలంలో పలు గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు లేక సమస్యగా మారిన మండలంలో తన శాఖ తరపున సమావేశంలో మాట్లాడాల్సిన ఆ అధికారి ఏదో విహారయాత్రకు వచ్చినట్లు సమావేశానికి వచ్చి మొబైల్‌లో పేకాట గేమ్ ఆడుతూ గడపడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈయన తీరు చూస్తుంటే ప్రజాసమస్యలపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్థం అవుతోంది. ఇదిలా ఉండగా మొబైల్‌లో పేకాట గేమ్ ఆడుతున్న దృశ్యాన్ని విలేకరి ఫొటో తీశాడని ఇతర ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళితే 'ఇలాంటివి చాలా జరుగుతుంటాయి.. ఏం కాదులే..' అని నిర్లక్ష్యంగా మాట్లాడంపై ఇతర శాఖల ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనయ్యారు. మండల సర్వసభ్యసమావేశంలో ఆర్టీసీ ఉద్యోగి మొబైల్‌లో పేకాట ఆడుతున్న విషయాన్ని ఎంపీడీవో సరస్వతి దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేస్తామని నిజమని తెలితే సంబంధిత ఉన్నత అధికారికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.










