Jul 04,2021 10:32

    చరిత్రలో షార్క్‌ దాడిలో చనిపోయిన తొలి వేటగాడి అస్థిపంజరాన్ని గుర్తించారు పరిశోధకులు. మూడువేల ఏళ్ల క్రితం నాటి ఓ వేటగాడి శరీరంపై చేసిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. అతడి ఎముకల గూడు/అస్థికలను పరిశోధించిన తర్వాత శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించారు. ఆక్స్‌ఫర్డ్‌ నేతృత్వంలో క్యోటో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ఆర్కియోలాజికల్‌ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. ఈ బృందంలో అలీసా వైట్‌, ప్రొఫెసర్‌ రిక్‌ స్కల్టింగ్‌ పాల్గొన్నారు. సెటో ఇన్లాండ్‌ సముద్ర తీరంలో జరిపిన పరిశోధనల్లో ఈ అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై పరిశోధకులు మాట్లాడుతూ షార్క్‌ అతి క్రూరంగా దాడి చేసినట్లు గుర్తించామన్నారు. మృతున్ని కమ్యూనిటీ శ్మశానవాటికలో ఖననం చేశారని తెలిపారు. సొరచేపల దాడికి సంబంధించిన నివేదికలు పురావస్తు శాఖ వద్ద అరుదుగా ఉన్నందున వారు దీనిపై అధ్యయనం ప్రారంభించారు. దీంతో షార్క్‌ దాడి కేసుల వైపు ఫోరెన్‌సిక్‌ ఆధ్వర్యంలో మొగ్గు చూపారు. ఫ్లోరిడా ప్రోగ్రామ్‌ ఫర్‌ షార్క్‌ రీసెర్చ్‌ నిపుణుడు జార్జ్‌ బెర్గెస్‌తో ఆక్స్‌ఫర్డ్‌ నిపుణుల బృందం కలిసి పనిచేసింది.
    షార్క్‌ దాడిలో వేటగాడికి 790 గాయాలు ఉన్నట్లు వారు తెలిపారు. స్కెలిటన్‌కు ఇన్ని గాయాలు ఉండటం చూసి తొలుత పరిశోధకులు ఆశ్చర్యపోయారట. అందులో ఎక్కువ శాతం కాళ్లు, చేతులు, ఉదరం ముందు భాగంలోనూ ఛాతీపైనే ఉన్నాయట. ఇలాంటి కేసులు చాలా తక్కువగా నమోదైన కారణంగా.. ఈ ఇద్దరు నిపుణులు మరికొంతమంది పరిశోధకులతో టైఅప్‌ అయ్యి, పరిశోధనలు నిర్వహించారు. వీలైనంతవరకూ దాడిని రీకన్‌స్ట్రక్ట్‌ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ స్కెలిటన్‌ మూడు వేల ఏళ్ల క్రితం నాటిదని గుర్తించారు. సుమారు క్రీస్తు పూర్వం 1370 నుంచి 1010 మధ్య కాలానికి చెందిన అస్థిపంజరంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అస్థిపంజరానికి చెందిన వ్యక్తిని నెంబర్‌ 24గా పిలవబడినట్లు బృందం గుర్తించింది. దాడి సమయంలో బాధితుడు సజీవంగా ఉన్నట్లు సూచించింది.

షార్క్‌ దాడిలో మరణించిన తొలి వ్యక్తి అస్థిపంజరం


    స్కెలిటన్‌ మీద ఉన్న గాయాల సరళిని చూస్తుంటే.. బతికుండగానే ఆ వ్యక్తిపై దాడి జరిగినట్లు తేల్చారు. దాడికి గురైన వెంటనే డెడ్‌బాడీని తీసుకొని, పాతిపెట్టినట్లుగా పరిశోధకులు తేల్చారు. దాంతోపాటు ఆ శరీరానికి చెందిన కుడికాలు లేదట. అలాగే ఎడమకాలు కూడా వేరుపడి ఉందట. దాన్ని బాధితుడి శరీరం మీద ఉంచి పాతిపెట్టారని పరిశోధనలో తేలిందట. ఈ మొత్తం వివరాలు, పరిశోధన తర్వాత.. ఆ వ్యక్తి మరణించింది షార్క్‌ దాడితోనేనని గుర్తించారు. చరిత్రలో షార్క్‌ దాడిలో మరణించిన తొలి వ్యక్తిగా గుర్తించారు. ఈ వ్యక్తి చేపల వేటకు వెళ్లే క్రమంలో అతనితో ఇంకొంత మంది ఉన్నారని, అందుకే దాడి జరిగిన వెంటనే అతని డెడ్‌బాడీని పాతిపెట్టగలిగారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు స్కెలిటన్‌పై ఉన్న పంటిగాట్లను బట్టి చూస్తే.. ఆ షార్క్‌ టైగర్‌కానీ, వైట్‌షార్క్‌ కానీ అయ్యిండొచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవ్యక్తిపై 790 షార్క్‌ చేసిన గాయాలు ఉన్నాయంటే.. ఆ వ్యక్తి ఎంతగా నరకయాతన అనుభవించి ఉంటాడో ఊహించుకోవచ్చు.